జ్యోతి మృతదేహం వెలికితీశామని వివరాలు చెబుతున్న జ్యోతి అన్నయ్య, తండ్రి, బంధువులు
సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్ (మంగళగిరి): ‘రాజధానిలో జ్యోతి హత్య’ కేసులో పోలీసులు నిజాలు కప్పిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? రాజధానిలో మహిళలకు భద్రత లేదనే చెడ్డపేరు రాకుండా చూసుకునే క్రమంలో కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒకసారి ఖననం చేశాక మృతదేహాన్ని బయటకు తీయాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. అయితే మండల మెజిస్ట్రేట్ కూడా లేకుండా దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు, వాచ్ స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఈ కేసులో ఏదో దాచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన యువతి హత్య కేసులో పోలీసులు, పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యురాలు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. మంగళగిరి మండలం నవులూరు సమీపంలో అమరావతి టౌన్ షిప్‌లో ఈ నెల 11 రాత్రి ప్రేమ జంటపై గుర్తు తెలియని అగంతకులు దాడి చేసిన ఘటనలో అంగడి జ్యోతి (25) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియుడు శ్రీనివాసరావు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది ఎవరనే విషయం మిస్టరీగా మారడంతో మూడు రోజుల్లో ఛేదిస్తామంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావు ప్రకటించారు. అయితే ఖననం చేసిన యువతి మృతదేహాన్ని బుధవారం అత్యంత గోప్యంగా బయటకు తీసి ఒంటిపై దుస్తులు, వాచీని సేకరించారనే విషయం బయటపడడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హత్య అనంతరం పోలీసులు ఏం చేయాలి.. ఏం చేశారు?
రాజధానిలో యువతి హత్యకు గురికావడం సంచలనం కలిగించిన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు జరపాల్సి ఉంది. అయితే యువతి మృతదేహంపై దుస్తులు, వాచీ, వేలిముద్రలు సేకరించకుండా ఖననం చేసేవరకు పోలీసులు చోద్యం చూశారు. బుధవారం యువతి సోదరుడు ప్రభాకర్‌ను పిలిచి మృతదేహాన్ని బయటకు తీసి దుస్తులు, వస్తువులు తమకు అప్పగించాలంటూ ఒత్తిడి చేశారు. కాటికాపరి పద్మ, మృతదేహాన్ని పూడ్చినవారిని పిలిపించి దొంగచాటుగా మృతదేహాన్ని బయటకు తీసి దుస్తులు, వాచీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మీడియాకు చెప్పవద్దంటూ తమను బెదిరించారని, చివరకు తమనే కేసులో ఇరికించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ యువతి అన్న ప్రభాకర్, ఇతర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము యువతి మృతదేహంపై దుస్తులను తొలగించిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించామని, పోస్టుమార్టం పూర్తి అయ్యాక మళ్లీ దుస్తులు తొడిగి పోలీసులకు అప్పగించామని మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ భారతి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా జ్యోతి మృతదేహంపై హత్య జరిగినప్పుడు ఉన్న దుస్తులను తొలగించి, ఓ నైటీని తీసుకువెళ్లి కప్పినట్లు కాటికాపరి గల్లా పద్మ చెప్పింది. అయితే మృతదేహాన్ని బయటకు తీసి, దుస్తులను సేకరించామనడం వాస్తవం కాదని మంగళగిరి రూరల్ సీఐ బాలాజీ పేర్కొన్నారు. తాము జ్యోతి మృతదేహాన్ని వెలికితీయించలేదని, ఎవరు తీశారో తమకు తెలియదని అన్నారు.
బంధువుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు
యువతిని హత్య చేసిన కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ మృతురాలు జ్యోతి బంధువులు, గిరిజన సంఘ నాయకులు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ముట్టడించి ఆందోళనకు దిగారు. కేసును పక్కదారి పట్టించడానికే ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి, ఆధారాల పేరుతో దుస్తులు, చేతివాచీని పోలీసులు తీసుకున్నారని మృతురాలు జ్యోతి అన్న ప్రభాకర్ ఆరోపించాడు. తాము కొందరి పేర్లు చెప్పి వారిపై అనుమానం వ్యక్తం చేసినా ఇంతవరకు వారిని అదుపులోకి తీసుకోలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని, కేసును పక్కదోవ పట్టిస్తున్న సీఐని సస్పెండ్ చేయాలని, జిల్లా జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఉన్నారని తెలుసుకున్న బంధువులు, గిరిజన నాయకులు అర్ధనగ్నంగా బైఠాయించి జ్యోతిని మభ్యపెట్టి హత్య చేసిన శ్రీనివాసరావును చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన జ్యోతి కుటుంబసభ్యులు, గిరిజన నేతలతో చర్చించారు. జ్యోతి మృతదేహంపై దుస్తులు తీయలేదని స్పష్టం చేశారు. బంధువుల సమక్షంలో రీపోస్టుమార్టం చేయించి, వీడియో తీయించి కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్‌కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్‌ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment