ఆడపిల్లకు అన్నిచోట్లా కష్టాలే. చిత్రంలో కనిపిస్తున్న తేజస్విని అనే వివాహిత అత్తింట ఆహుతైంది. కొప్పళ జిల్లా శ్రీరామనగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.
కర్ణాటక, గంగావతి రూరల్: తాలూకాలోని శ్రీరామనగర్‌లో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో ఆహుతైన ఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీసుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్న ఫ్యాన్సీ స్టోర్ యజమాని కిరణ్ భార్య తేజస్విని (26) ఇంట్లోనే సగం కాలిన స్థితిలో శవమై ఉండటాన్ని స్థానికులు గుర్తించి గంగావతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. కిరణ్, తేజస్విని దంపతులకు ఆరు నెలల పాప ఉంది. ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు నిత్యం సూటిపోటి మాటలతో హింసిస్తూండేవారు. ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందని అత్తింటివారు చెబుతుండగా, భర్త, అత్తమామలే హింసించి నిప్పంటించి చంపారని తేజస్విని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇంట్లో వేసి నిప్పంటించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
పరారీలో అత్తమామలు
మృతురాలి భర్త పోలీసు కస్టడీలో ఉండగా, అత్తమామలు పరారీలో ఉన్నారు. ఇంటిలో సగభాగం కాలిన మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టం కోసం గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment