వడ్డేపల్లి జంక్షన్ సమీపంలో రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు
వరంగల్ క్రైం: మద్యం మత్తులో నిబంధనలు కొట్టుకుపోతున్నాయి. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల ఎదుట నడిరోడ్డుపై మందుబాబులు వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సాయంత్రం 6 గంటల దాటితే మద్యం షాపుల ఎదుట నడిరోడ్డు వరకు వాహనాలను పార్కింగ్ చేయడంతో వాహనదారులు, ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటివల హన్మకొండ అమృత జంక్షన్ పరిధిలో అశ్విని బార్‌లో ఉదయం 7 గంటలకే మద్యం అమ్ముతుంటే స్థానిక ఇన్స్‌పెక్టర్ సంతప్‌రావు కేసు నమోదు చేశారు. వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.
మందుబాబుల వీరంగం...
మద్యంషాపుల ఎదుట మందు బాబుల వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థిలు ఉన్నాయి. ఇటివల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ మద్యం షాపు ఎదుట మందుబాబుల వీరంగం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడ మద్యం బాటిళ్లను కోనుక్కొని పక్కనే ఉన్న డబ్బాల ముందు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. అటువైపు వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
(ఎన్‌ఐటీ సమీపంలోని ఓ మద్యం షాపు ఎదుట.. )
ప్రేక్షక పాత్రలో పోలీసులు..
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేవు. గోపాలస్వామి గుడి సమీంలో ఉన్న మద్యం షాపులు, మిల్స్‌కాలనీ జంక్షన్, స్టేషన్ రోడ్డు, అండర్ బ్రిడ్జి, కాశిబుగ్గ జంక్షన్, హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, లోకల్ డిపో, వడ్డేపల్లి క్రాస్, ఫాతిమా నుంచి కేయూ రోడ్డులోని వడ్డేపల్లి జంక్షన్, తదితర ప్రాంతాలలో ఉన్న షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు నగరంలో పార్కింగ్ లేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment