
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన డ్రైవర్లు...
బంజారాహిల్స్: అకారణంగా యజమానురాలు డ్రైవర్‌ను అసభ్యపదజాలంతో దూషించిందని ఆరోపిస్తూ ఆల్ సిటీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..చింతల్‌కు చెందిన విజయ్‌భాస్కర్ గత కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 10(సి) గాయత్రిహిల్స్‌లో ఉంటున్న విజయనిర్మల అనే మహిళ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జ్వరం రావడంతో అతను గత రెండు రోజులుగా డ్యూటీకి రావడం లేదు. దీంతో ఆదివారం అతడికి ఫోన్ చేసిన యజమానురాలు విజయనిర్మల అసభ్యంగా దూషించింది. దీనిని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన బాధితుడు యూనియన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో యూనియన్‌కు చెందిన వంద మంది డ్రైవర్లు ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డ్రైవర్‌ను కించపరిచేలా మాట్లాడిన విజయనిర్మలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు ఏసు, షకిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment