సాక్షి, హైదరాబాద్ : రోజుకో లీకుతో, ఏదేదో జరిగిపోతోందన్న ప్రచారంతో సస్పెన్స్ సినిమాను తలపించిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం కేసు కథ కంచికి చేరినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించలేక పోయిందని... సిట్ చేసిన హడావుడి, గంటల తరబడి విచారణ అంతా ఉత్తదేనని తేలిపోయింది.
అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ 10 మంది సినీ ప్రముఖులను విచారించగా.. ముగ్గురి నుంచి మాత్రమే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని... ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్సైజ్ సిట్‌కు నివేదిక అందిందని విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో ఈ నెల చివరి వారంలోగా చార్జిషీటు వేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది.
కోర్టులో నిలబడతాయా?
ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, ఆధారాలు ఎంతవరకు కోర్టులో నిలబడతాయన్న దానిపై ఎక్సైజ్ సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సినీ ప్రముఖులు దోషులేనని తేల్చదగిన కచ్చితమైన ఆధారాలేవీ అధికారులకు లభించలేదని తెలుస్తోంది. అరకొర ఆధారాలు కోర్టులో నిలవకపోతే... కేసుతో ఇబ్బందిపడ్డ సినీ ప్రముఖులు పరువు నష్టం దావా వేసే అవకాశముందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి చార్జిషీటుతోనే కేసును తేల్చకుండా.. అనుబంధ చార్జిషీట్లు వేస్తూ కేసును పొడిగించాలని భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కెల్విన్ ‘బెదిరింపు’లతో..
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్. అతను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు దొరికే సమయానికే బాగా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజున కెల్విన్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో రహస్యంగా విచారించారు. ఉన్నతాధికారి అకున్ సభర్వాల్ కూడా సాధారణ దుస్తుల్లో అక్కడికి వచ్చారు. అంతా సాధారణ సిబ్బందేనని భావించిన కెల్విన్... అధికారులను బెదిరించడానికి ప్రయత్నించాడు. ‘నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నా సత్తా ఏమిటో చూపిస్తా. మీకు 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. నా కోసం ఆ దర్శకుడు ఫోన్ చేస్తాడు. ఫలానా రాజకీయ నాయకుడి కుమారుడు వస్తాడు.. ఆ హీరోయిన్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది..’అంటూ పలువురు ప్రముఖుల పేర్లను చెప్పినట్లు సమాచారం. ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కెల్విన్ ఫోన్‌కాల్ లిస్టు, మెసేజీలు, అతడి వద్ద దొరిన ఫొటోల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగానే పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను పిలిపించి విచారించారు.
ఎక్సైజ్ సిట్‌కు ఏమేం దొరికాయి?
విచారణ ఎదుర్కొన్న హీరోయిన్ ఫోన్ నుంచి కెల్విన్‌కు 40 ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. అందులో ఒక్క ఎస్సెమ్మెస్‌లో మాత్రమే ఎల్‌ఎస్‌డీ అనే పదం ఉంది. మిగతా వాటిలో బ్లాటింగ్, మెటీరియల్ అనే పదాలను వాడినట్లు సిట్ గుర్తించింది. ఇక ఆ హీరోయిన్ నుంచి కెల్విన్‌కు ఎస్సెమ్మెస్ వెళ్లిన ప్రతిసారి అరగంట గంట సమయంలోపు సదరు దర్శకుడి బ్యాంకు ఖాతా నుంచి కెల్విన్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఈ హీరోయిన్, దర్శకుడు, కెల్విన్ కలసి ఉన్న ఫొటోలు కూడా దొరికాయి. ఈ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగింది. ఆ దర్శకుడిని సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. అయితే ఈ ఆధారాలేవీ కోర్టులో గట్టిగా నిలవవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎల్‌ఎస్‌డీ అంటే సినీ పరిభాషలో ‘లైట్ స్కేల్ డిన్నర్ (తక్కువ స్థాయిలో భోజనం)’అనే వాడుక ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కాబట్టి సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాల నుంచి ఆయనకు డబ్బు వెళ్లేందుకు చాలా అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.
ఒకరు డ్రగ్ తీసుకున్నట్లు తేలినా..
ఫోరెన్సిక్ పరిశీలనలో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే తరచూ విదేశాలకు వెళ్లే ఆ ప్రముఖుడు ఎక్కడ డ్రగ్ తీసుకున్నాడో చెప్పటం కష్టమని, ఫలానా చోట, ఫలానా దేశంలో డ్రగ్ తీసుకున్నాడని నిరూపించటం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి డ్రగ్స్ వాడకానికి చట్టబద్ధత ఉందని.. ఆ దేశాల్లో డ్రగ్స్ తీసుకుని ఉంటే పరిస్థితి ఏమిటన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇక మిగతా ప్రముఖుల విషయంలో ఈ మాత్రం ఆధారాలు కూడా లభ్యం కాలేదు.
కేసుకు సంబంధించి ఇంకొన్ని వివరాలు..
⇒ విచారణ ఎదుర్కొన్న ఒక నటుడు కొన్నేళ్ల కింద ఒకటి రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. కానీ ఇప్పుడా విషయాన్ని నిరూపించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. విచారణ సమయంలో తన పరువు తీశారంటూ కన్నీరు పెట్టిన ఆ నటుడు.. ఎక్సైజ్ సిట్ చార్జిషీటు వేయగానే పరువునష్టం దావా వేయాలన్న యోచనతో ఉన్నట్టు సమాచారం.
⇒మరోవైపు డ్రగ్స్ విక్రయించినవారిని కాకుండా కేవలం డ్రగ్స్ వాడిన వారిని అరెస్టు చేసి, చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. వారిని అరెస్టు చేశాక కోర్టుల్లో నిరూపించలేకపోయినా, వారు పరువు నష్టం దావాలు వేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అంశంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన గుజరాత్ ఎన్నికల విధుల్లో ఉండటంతో అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులను సంప్రదించినా.. కేసుపై మాట్లాడేందుకు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment