వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి
హిమాయత్‌నగర్: హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు యత్నిస్తున్న ఘనా దేశానికి చెందిన యువతిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 50గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్ట్ససీ, నోకియా మొబైల్‌ను స్వాధీనం చేసుకుని, ఆమె పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికాలోని ‘ఘనా’కు చెందిన ‘జెనెవివే అలాండో ఒకేట్చ్’ టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చింది. కొన్నాళ్లపాటు గోవాలో ఉన్న ఆమెకు అక్కడ టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ‘ఓబో’తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు ఆర్డర్‌పై మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ‘కొకైన్, ఎక్ట్ససీ’ అందజేస్తే రూ.20వేలు ఇస్తానని చెప్పడంతో ఓబో చెప్పడంతో ఆమె నగరానికి వచ్చింది. ‘ఓయో’ యాప్ ద్వారా సోమాజీగూడలోని ఓ హోటల్‌లో 20, 21వ తేదీల్లో బస చేసేందుకుగాను గదిని బుక్ చేసుకుంది. 20న ఉదయం బస్సులో నగరానికి చేరుకున్న ఆమె అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్ సమీపంలో కొందరు కస్టమర్లకు ‘కొకైన్, ఎక్ట్ససీ’ అందజేస్తుండగా టాస్క్‌ఫోర్స్ సీఐ కరుణ తన బృందంతో దాడి చేసి జెనెవివే అలాండో ఒకేట్చ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మూడు నెలల క్రితం కూడా సరఫరా
మూడు నెలల క్రితం కూడా ఓబో సూచన మేరకు నగరానికి వచ్చిన జెనెవివే అలాండో ఒకేట్చ్ ‘50గ్రాముల కొకైన్, పది గ్రాముల ఎక్ట్ససీ’ని వినియోదారులకు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఓబోకు నగరంలో పదిమంది కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. తరచూ గోవా నుంచి ఆఫ్రికాకు చెందిన యువతులను హైదరాబాద్‌కు పంపుతూ వారికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
సరుకు అందేవరకు లైవ్ ఫోన్ కాన్ఫరెన్స్
సరుకు తీసుకుని నగరానికి వచ్చిన యువతులతో ఓబో ఫోన్ టచ్‌లో ఉంటాడు. కొనుగోలు దారులకు నేరుగా ఫోన్ చేసే అతను వారితో మాట్లాడుతూనే సరుకు తీసుకువచ్చిన యువతితో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు. సదరు యువతి సూచన మేరకు ఆమె బస చేసిన హోటల్ వద్దకు చేరుకుంటారు. ఆమె మాదకద్రవ్యాలను తీసికెళ్లి వారి చేతికి ఇవ్వగానే ఫోన్‌కాల్ కట్ చేస్తాడు. దీంతో సరుకు తీసుకు వచ్చిన యువతులకు కొనుగోలుదారులకు సంబందించి ఎలాంటి వివరాలు తెలియవు. ఓబో చెప్పినట్లు చేస్తేనే డబ్బులు ఇస్తాడని జెనెవివే అలాండో ఒకేట్చ్ విచారణలో వెల్లడించినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.
త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం
జెనెవివే అలాండో ఒకేట్చ్ కాల్ లిస్ట్‌లో ఎవరైనా సినీప్రముఖులు ఉన్నారా? అంటూ మీడియా ప్రశ్నించగా అందుకు ఆధారాలు లేవని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కేవలం కొందరు యువకులకు వీటిని విక్రయించేందుకు ఆమె నగరానికి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ప్రస్తుతానికి సినీప్రముఖల పేర్లు, ఫోన్ నంబర్లు జెనెవివే అలాండో ఒకేట్చ్’ కాల్ లిస్ట్‌లో లేవన్నారు. త్వరలో ఓబోను పట్టుకుని మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment