స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, గంజాయిని చూపుతున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా వ్యవస్థీకృత మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్ కుటుంబం పాతికేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కార్ఖానా ప్రాంతంలో స్థిరపడింది. ఇంటర్మీడియట్‌తో చదువు మానేసిన ఫ్రాన్సిస్ ఆపై దురలవాట్లకు బానిసగా మారాడు. మాదకద్రవ్యాలు వినియోగించడం మొదలు పెట్టిన అతడికి ఆరు నెలల క్రితం ప్రస్తుతం గోవాలో ఉంటున్న సికింద్రాబాద్ వాసి ఆర్‌ఎం గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. తరచు సిటీకి వచ్చి వెళ్తున్న ఆర్‌ఎం గౌడ్ తనతో పాటు కొన్ని డ్రగ్స్ తీసుకువచ్చి ఫ్రాన్సిస్‌కు విక్రయించేవాడు. వీటిని ఇతడు విరివిగా వినియోగిస్తుండటంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో ఇతడి స్నేహితులు, పరిచయస్తులు తమకూ డ్రగ్స్ కావాలని కోరేవారు.
ఇలా డిమాండ్ పెరగడంతో అప్పటి వరకు డ్రగ్ వినియోగదారుడిగానే ఉన్న ఫ్రాన్సిస్ ఆపై పెడ్లర్‌గా మారి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఇతడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. మారేడ్‌పల్లికి చెందిన విద్యార్థి గౌతమ్‌తో కలిసి ముఠా కట్టాడు. అదిలాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ ఉంటున్న సత్తార్ అనే వ్యక్తి నుంచి కేజీ రూ.4 వేల నుంచి రూ.5 వేలకు గంజాయి ఖరీదు చేసే వాడు. దీనిని బస్సుల్లో గోవాకు తరలించి కేజీ రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రిటైల్‌గా చిన్న చిన్న ప్యాకెట్లలో ఉంచి అమ్ముతుండేవాడు. అలా వచ్చిన డబ్బుతో గోవాలో ఉండే అక్బర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అక్కడ తక్కువ ధరకు కొని నగరంలో రిటైల్‌గా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. హెరాయిన్ గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేలకు కొని రూ.7 వేల నుంచి రూ.9 వేలకు, ఎల్‌ఎస్‌డీ బోల్డ్ ఒక్కోటి రూ.వెయ్యి నుంచి రూ.1500 కొని రూ.3 వేలకు, ఎక్స్‌టసీ ట్యాబ్లెట్స్ ఒక్కోటి రూ.1800 నుంచి రూ.2 వేలకు కొని రూ.3,500 విక్రయించేవాడు. కొన్నాళ్ళుగా గుట్టుగా సాగిస్తున్న వీరి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి శుక్రవారం ఫ్రాన్సిస్, గౌతమ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదు గ్రాముల హెరాయిన్, 28 బోల్డ్‌ల ఎల్‌ఎస్‌డీ, 32 ఎక్స్‌టసీ ట్యాబ్లెట్స్, మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గౌడ్, అక్బర్, సత్తార్ కోసం గాలిస్తున్నారు.
‘న్యూ’ పార్టీలపై నిఘా: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరు ఈ డ్రగ్ తీసుకువచ్చారు. ఈ వేడుకల నేపథ్యంలో సిటీలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ఉంచాం. ఇప్పటికే ఈవెంట్లు నిర్వహించే పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశాం. న్యూ ఇయర్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం, మైనర్లు మద్యం తాగడం వంటివి లేకుండా చూడాలని స్పష్టం చేశాం.– అంజనీకుమార్, కొత్వాల్
Comments
Please login to add a commentAdd a comment