చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు
ప్రకాశం, చీరాల రూరల్: తాగి గుడిలోకి వెళ్లొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి బరిసెతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక హరిప్రసాద్ నగర్‌లో జరిగింది. క్షతగాత్రుడు ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. విఠల్‌నగర్‌కు చెందిన కట్టిబోయిన శ్రీను మద్యం తాగి హరిప్రసాద్ నగర్లోని పోలేరమ్మ గుడిలోకి వెళ్తున్నాడు. పక్కనే నిల్చొని ఉన్న విఠల్ నగర్‌కు చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు అనే యువకుడు కలుగజేసుకుని గుడిలోకి వెళ్లొద్దని చెప్పాడు.
శ్రీను, వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది సర్ది చెప్పడంతో ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు. మరికొద్ది సేపటి తర్వాత శ్రీను బరిసె వంటి ఇనుప ఆయుధంతో వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి మళ్లీ గొడవ పెట్టుకుని బరిసెతో ఛాతి కుడి వైపున బలంగా పొడిచాడు. వెంకటేశ్వర్లు పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లు తల్లి బయటకు వచ్చి తమ కుమారుడిని ఎందుకు కొడుతున్నావని అడ్డుగా వెళ్లింది. మరింత ఆగ్రహం చెందిన శ్రీను ఆమెను నోటితో కొరికి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment