దుబాయ్ : నటి శ్రీదేవి మృతి కేసు విచారణలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో పలు అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అవి నివృత్తి అయితేనే ఆమె మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు.
- హోటల్ గదిలో అసలేం జరిగింది?
- శ్రీదేవి అసలు ఎన్ని గంటలకు మరణించారు?
- పోలీసులకు ఆలస్యంగా సమాచారం ఎందుకు ఇచ్చారు?
- ఫోరెన్సిక్ నివేదిక రాకముందే గుండెపోటు అని ఎందుక ప్రకటించారు?
- మద్యం తాగే అలవాటు లేని శ్రీదేవి కడుపులోకి ఆల్కహాల్ ఆనవాలు ఎలా వచ్చాయి?
- హోటల్‌లోని సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు?
- కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు?
- బోనీ ఎందుకు తిరిగొచ్చారు?
- మార్వా పెళ్లిలో ఏమైనా గొడవ జరిగిందా?
- పెళ్లి 20వ తేదీన ముగిస్తే.. 24న ఆమె చనిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది?
తదితర అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రాసిక్యూషన్ అధికారుల చేతికి అందింది. దీంతోపాటు రెండో ఫోరెన్సిక్ నివేదిక వెలువడాల్సి ఉంది. వాటిని పరిశీలించాక అవసరమైతే శ్రీదేవి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆమె పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్.. కారణాలు అయ్యి ఉండొచ్చన్న కోణంలో సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే వివాహ వేడుక తాలుకు ఫుటేజీలను తెప్పించుకున్న అధికారులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు అటోప్సీ రిపోర్ట్ తోపాటు, బోనీ కపూర్ ఇచ్చిన వివరణపై ప్రాసిక్యూషన్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోనీ పాస్ పోర్టును స్వాధీనపరుచుకున్నారు. శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ తేవాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరిన అధికారులు.. ఆమె కాల్ డేటా మొత్తాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్, హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు శ్రీదేవి సవతి కొడుకు, నటుడు అర్జున్ కపూర్‌ను దుబాయ్ బయలుదేరటం గమనార్హం. ఇంకోపక్క మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే హోటల్ గదిని సీజ్ చేసిన అధికారులు.. ఏం జరిగిందో తెలుసుకోడానికి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులన్నీ వీడితేనే ఆమె మృతదేహ తరలింపునకు క్లియరెన్స్ సర్టిఫికెట్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం చేస్తారు. దీంతో ఆమె మృతదేహం తరలింపులో మరింత జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఏ విషయమన్నదానిపై ప్రాసిక్యూషన్ అధికారులు మరికాసేపట్లో ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment