Sridevi Death Case
-
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
శ్రీదేవి కేసు; దుబాయ్ అధికారుల తప్పిదాలు!
సాక్షి, వెబ్‌డెస్క్ : యావత్ భారతావని అతిలోక సుందరిగా ఆరాధించే శ్రీదేవి అకాల మరణంపై దుబాయ్ అధికారుల వరుస తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను బసచేసిన జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 రాత్రి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయారని అక్కడి పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు జారీ అయిన డెత్, ఎంబామింగ్ సర్టిఫికేట్లలో మృతురాలి వివరాలను ఒక్కోచోట ఒక్కోలా పేర్కొనడం గమనార్హం. గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదన్న విషయం తెలిసిందే. మరి అంత పకడ్బందీగా సాగే వ్యవహారాల్లో తప్పులు చోటుచేసుకోవడం, అదికూడా శ్రీదేవి లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ విషయంలో జరుగడం అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి. శ్రీదేవి వయసెంత? శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్ అలియాస్ శ్రీదేవి 1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించారన్నది నిర్వివాదాంశం. ఆ ప్రకారం చనిపోయేనాటికి ఆమె వయసు 54 ఏళ్లపైమాటే. కానీ యూఏఈ ఆరోగ్య శాఖ జారీచేసిన డెత్ సర్టిఫికేట్లో శ్రీదేవి వయసు 53 ఏళ్లుగా పేర్కొన్నారు. అదే ఎంబామింగ్ ప్రక్రియకు సంబంధించి అదే శాఖ జారీ చేసిన మరో ఆదేశాల్లో మృతురాలి వయసును 52 ఏళ్లని రాశారు. అందరికీ తెలిసినట్లు ఆమె వయసు 54 ఏళ్లు కాకుండా పాస్‌పోర్టులో మరోలా ఉందనుకున్నా, రెండు సర్టిఫికేట్లలోనూ దానినే పేర్కొనాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోచోట ఒక్కోలా వయసును పేర్కొనడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పటికే నటి మరణంపై కొన్ని అనుమానాలు తలెత్తిన దరిమిలా దీనిపై దుబాయ్ అధికారులు వివరణ ఇస్తారా లేదా అన్నది తేలాల్సిఉంది. ఫిబ్రవరి 27న యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎంబామింగ్ సర్టిఫికేట్ ఇది(వయసు52గా పేర్కొన్నారు) ఆ మూడురోజులూ శ్రీదేవి మృతదేహం అక్కడే.. యూఏఈ ఆరోగ్య శాఖ భవనంలో పోస్ట్‌మార్టం అనంతరం భారత కార్మికుల మృతదేహాలను ఎక్కడైతే భద్రపరుస్తారో అదే చోట శ్రీదేవి మృతదేహాన్ని కూడా మూడు రోజులపాటు ఉంచారు. మంగళవారం సాయంత్రానికి దర్యాప్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి విమానాశ్రయానికి తరలించారు. నిజానికి దుబాయ్ అధికార వర్గాలు ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయడం అరుదు. అయితే శ్రీదేవి మరణం, ఆమె భౌతికాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారనేదానిపై స్వదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యాన్ని వివరిస్తూ భారత్‌లోని యూఏఈ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. ఫిబ్రవరి 26న జారీ అయిన శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ (వయసు 53గా రాశారు) నేడు అంత్యక్రియలు : శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం ముంబై లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచునున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. విల్లే పార్లేలోని సేవా జమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
శ్రీదేవి మృతి కేసు.. అనుమానాలివే!
దుబాయ్ : నటి శ్రీదేవి మృతి కేసు విచారణలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో పలు అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అవి నివృత్తి అయితేనే ఆమె మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు. హోటల్ గదిలో అసలేం జరిగింది? శ్రీదేవి అసలు ఎన్ని గంటలకు మరణించారు? పోలీసులకు ఆలస్యంగా సమాచారం ఎందుకు ఇచ్చారు? ఫోరెన్సిక్ నివేదిక రాకముందే గుండెపోటు అని ఎందుక ప్రకటించారు? మద్యం తాగే అలవాటు లేని శ్రీదేవి కడుపులోకి ఆల్కహాల్ ఆనవాలు ఎలా వచ్చాయి? హోటల్లోని సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు? కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? బోనీ ఎందుకు తిరిగొచ్చారు? మార్వా పెళ్లిలో ఏమైనా గొడవ జరిగిందా? పెళ్లి 20వ తేదీన ముగిస్తే.. 24న ఆమె చనిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది? తదితర అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రాసిక్యూషన్ అధికారుల చేతికి అందింది. దీంతోపాటు రెండో ఫోరెన్సిక్ నివేదిక వెలువడాల్సి ఉంది. వాటిని పరిశీలించాక అవసరమైతే శ్రీదేవి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆమె పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్.. కారణాలు అయ్యి ఉండొచ్చన్న కోణంలో సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే వివాహ వేడుక తాలుకు ఫుటేజీలను తెప్పించుకున్న అధికారులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు అటోప్సీ రిపోర్ట్ తోపాటు, బోనీ కపూర్ ఇచ్చిన వివరణపై ప్రాసిక్యూషన్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోనీ పాస్ పోర్టును స్వాధీనపరుచుకున్నారు. శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ తేవాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరిన అధికారులు.. ఆమె కాల్ డేటా మొత్తాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్, హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు శ్రీదేవి సవతి కొడుకు, నటుడు అర్జున్ కపూర్‌ను దుబాయ్ బయలుదేరటం గమనార్హం. ఇంకోపక్క మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హోటల్ గదిని సీజ్ చేసిన అధికారులు.. ఏం జరిగిందో తెలుసుకోడానికి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులన్నీ వీడితేనే ఆమె మృతదేహ తరలింపునకు క్లియరెన్స్ సర్టిఫికెట్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం చేస్తారు. దీంతో ఆమె మృతదేహం తరలింపులో మరింత జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఏ విషయమన్నదానిపై ప్రాసిక్యూషన్ అధికారులు మరికాసేపట్లో ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. -
శ్రీదేవి భర్త ఇంటరాగేషన్.. ట్విస్టింగ్ న్యూస్
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. హోటల్ గదిలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయిన సమయంలో భర్త బోనీ కపూర్ అక్కడే ఉన్నారన్న సంగతి తెలిసిందే. విచారణలో ఆయన ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ఈ మేరకు బోనీని దుబాయ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారని, ఆయన చెప్పిన విషయాలకు, వైద్యులు డెత్ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు ఏమాత్రం పోలికలేదని, దీంతో బోనీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా ‘అసలు బోనీని పోలీసులు ఇంటరాగేషనే చెయ్యలేదం’టూ ప్రఖ్యాత ఖలీజ్ టైమ్స్ మంగళవారం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణవార్తను తొలుత బ్రేక్ చేసింది కూడా ఇదే వార్తా సంస్థ కావడం గమనార్హం. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో శ్రీదేవి చనిపోయినట్లు శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను రషీద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అటుపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం యూఏఈ ఆరోగ్యశాఖ భవనానికి తరలించారు. ఆదివారం నాడు కొద్ది నిమిషాలు మాత్రమే బోనీని పోలీసులు ప్రశ్నించారని, ఆ తర్వాత గంటల తరబడి విచారించారనేది పూర్తి అవాస్తమని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. -
శ్రీదేవి కేసు; రాజు కూడా జోక్యం చేసుకోలేరు
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసుపై చిలువలు పలువలుగా వెలువడుతున్న మీడియా కథనాలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. డెత్ సర్టిఫికేట్లో శ్రీదేవి ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయాన్న నిర్ధారణ మరిన్ని అనుమానాలు రెకెత్తిస్తోంది. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడేఉన్న బోనీ కపూర్‌ను దుబాయ్ పోలీసులు గంటల తరబడి విచారించారని, అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని భారతీయ వార్తా సంస్థలు పేర్కొంటే.. అసలు బోనీని ఇంటరాగేషనే చెయ్యలేదని గల్ఫ్ మీడియా వెల్లడించింది. ఒక కేసులో ఇంత గడబిడకు ఆస్కారం ఉంటుందా? అనుకుంటే, గల్ఫ్ దేశాల్లో మాత్రం తప్పదనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రాసిక్యూషన్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదు. అక్కడి నుంచి ఖచ్చితమైన సమాచారమేదీ రాకపోవడంతో ఊహాగానాలు, విరుద్ధకథనాలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. మృతదేహం ఇప్పట్లో రాదా? : శ్రీదేవీ మృతిపై తొలుత దుబాయ్ పోలీసులు విచారించారు. యూఏఈ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వారు జారీ చేసిన డెత్ సర్టిఫికేట్లో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ వల్లే శ్రీదేవి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆ యాక్సిడెంట్‌కు దారితీసిన పరిస్థితులను మాత్రం పేర్కొనలేదు. సోమవారం వెల్లడైంది తాత్కాలిక నివేదిక అనుకుంటే, పూర్తిస్థాయి రిపోర్టులు రావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పుడీ కేసు దుబాయ్ పోలీసుల నుంచి ప్రాసిక్యూషన్‌కు బదిలీ అయింది. ఇది సాధారణ న్యాయ ప్రక్రియే అని అక్కడి అధికారులు చెప్పారు. కాగా, పోలీసుల విచారణ, వైద్యుల రిపోర్టులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్ నయీబ్ అసంతృప్తి వ్యక్తం చేశారని, రీఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారని సోమవారం లీకులు వచ్చాయి. కానీ మంగళవారం ఉదయం నాటికి.. ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందారని, ఇక మృతదేహాన్ని తరలించడమే మిగలుందని వార్తలు వెలువడుతున్నాయి. నేరమేమీ జరగలేదని, ప్రమాదవశాత్తూ మరణించారని ప్రాసిక్యూటర్ ధృవీకరించిన తర్వాతే శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించే వీలుంటుంది. రీఇన్వెస్టిగేషన్ వార్త నిజమైతే గనుక మృతదేహం తరలింపు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.