శ్రీదేవి, దుబాయ్ రాజు మొహమ్మద్ బిన్ రషీద్ (ఫైల్ ఫొటోలు)
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసుపై చిలువలు పలువలుగా వెలువడుతున్న మీడియా కథనాలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. డెత్ సర్టిఫికేట్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయాన్న నిర్ధారణ మరిన్ని అనుమానాలు రెకెత్తిస్తోంది. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడేఉన్న బోనీ కపూర్‌ను దుబాయ్ పోలీసులు గంటల తరబడి విచారించారని, అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని భారతీయ వార్తా సంస్థలు పేర్కొంటే.. అసలు బోనీని ఇంటరాగేషనే చెయ్యలేదని గల్ఫ్ మీడియా వెల్లడించింది.
ఒక కేసులో ఇంత గడబిడకు ఆస్కారం ఉంటుందా? అనుకుంటే, గల్ఫ్ దేశాల్లో మాత్రం తప్పదనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రాసిక్యూషన్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదు. అక్కడి నుంచి ఖచ్చితమైన సమాచారమేదీ రాకపోవడంతో ఊహాగానాలు, విరుద్ధకథనాలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి.
మృతదేహం ఇప్పట్లో రాదా? : శ్రీదేవీ మృతిపై తొలుత దుబాయ్ పోలీసులు విచారించారు. యూఏఈ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వారు జారీ చేసిన డెత్ సర్టిఫికేట్లో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ వల్లే శ్రీదేవి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆ యాక్సిడెంట్‌కు దారితీసిన పరిస్థితులను మాత్రం పేర్కొనలేదు. సోమవారం వెల్లడైంది తాత్కాలిక నివేదిక అనుకుంటే, పూర్తిస్థాయి రిపోర్టులు రావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది.
ఇప్పుడీ కేసు దుబాయ్ పోలీసుల నుంచి ప్రాసిక్యూషన్‌కు బదిలీ అయింది. ఇది సాధారణ న్యాయ ప్రక్రియే అని అక్కడి అధికారులు చెప్పారు. కాగా, పోలీసుల విచారణ, వైద్యుల రిపోర్టులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్ నయీబ్ అసంతృప్తి వ్యక్తం చేశారని, రీఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారని సోమవారం లీకులు వచ్చాయి. కానీ మంగళవారం ఉదయం నాటికి.. ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందారని, ఇక మృతదేహాన్ని తరలించడమే మిగలుందని వార్తలు వెలువడుతున్నాయి. నేరమేమీ జరగలేదని, ప్రమాదవశాత్తూ మరణించారని ప్రాసిక్యూటర్ ధృవీకరించిన తర్వాతే శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించే వీలుంటుంది. రీఇన్వెస్టిగేషన్ వార్త నిజమైతే గనుక మృతదేహం తరలింపు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment