మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు, మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య
కరెంటు రైతుల పాలిట శాపంగా మారుతోంది. ట్రాన్స్‌కో శాఖలో కొత్త టెక్నాలజీ వచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా పాత విద్యుత్ తీగలు అలాగే ఉండటంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈదురు గాలులు వీచినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, స్తంభాలు, బోరుబావుల వద్ద తీగలు తెగిపోయి రైతులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు.
సాక్షి, భూత్పూర్: మండలంలోని అమిస్తాపూర్‌లో మంగళవారం యాదగిరి ప్రశాంత్ (42) అనే రైతు తన పొలంలోనే విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. వివరాలిలా.. తనకున్న మూడు ఎకరాల పొలంలో వరి పంట సాగుచేసిన ప్రశాంత్ మంగళవారం ఉదయం చేనుకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ పనిచేయక పోవడంతో కరెంట్ స్తంభం నుంచి వచ్చే వైర్లను పరిశీలించారు. దీంతో స్తంభం నుంచి స్టార్టర్ డబ్బాకు వచ్చే వైరు మధ్యలో తెగిపోయింది. వాటిని సరి చేస్తుండగా అకస్మాత్తుగా వైర్లు చేతికి తగలడంతో ప్రమాదం సంభవించి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు కాసేపటి తర్వాత ఇరుగుపొరుగు రైతులు గమనించి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. భార్య యాదగిరి దేవిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సింహులు పరామర్శించారు.
శంకర్‌నగర్‌లో..
గట్టు : మండలంలోని ఆరగిద్ద పంచాయతీ పరిధిలోని శంకర్‌నగర్ గ్రామానికి చెందిన రైతు బోయ కుర్తిప్పల నాగన్న(45) విద్యుతాఘాతానికి మృతి చెందాడు. రోజులాగే మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. పత్తి పొలంలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడి ఉండటం గమనించకుండా తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులు విగతజీవిగా పడి ఉన్న నాగన్నను చూసి బోరున విలపించారు. మృతునికి భార్య పద్దమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
నాయకుల పరామర్శ
విషయం తెలుసుకున్న గద్వాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్ గోపాల్, ఏఈఓ తిరుమలేష్, టీఆర్‌ఎస్ నాయకులు తిప్పారెడ్డి, హనుమన్న, రామకృష్ణారెడ్డి, బసన్న, హనుమంతు, కిష్టన్న, గోపాల్, బజారి, నర్సింహులు పరామర్శించిన వారిలోఉన్నారు.
తిర్మలాపూర్‌లో..
చిన్నచింతకుంట (దేవరకద్ర): మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఖాజామైనొద్దీన్ (45) కొన్నేళ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పశువులకు నీరు పెట్టేందుకు తన యజమాని పొలంలో సింగిల్‌ఫేజ్ మోటార్ ఆన్ చేసేందుకు స్విచ్‌బోర్డులో వైర్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు ఓ వైరు చేతికి తగిలింది. దీంతో పెద్దశబ్ధంతో విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నా డు. మృతుడి భార్య ఖాజాబీ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment