విద్యుత్ ఏఈ పర్వతాలు
సాక్షి, జడ్చర్ల: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్
రెండు నెలలు తిరిగా..
గ్రామ శివారులోని సర్వే నంబర్లు 116, 117లో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం గత రెండు నెలల క్రితం తన తల్లి అలివేలు, తమ్ముడు రవీందర్‌రెడ్డి, పక్క పొలం రైతు గజేందర్‌రెడ్డి పేరిట డీడీ తీసి తీసి జడ్చర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇచ్చానని రైతు రాజేందర్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ కోసం గత రెండు నెలల నుంచి ఏఈ దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తామని, రూ.15 వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని రూ.12 వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం ఏఈ కార్యాలయంలో ఏఈ పర్వతాలుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు.
మండలంలో నలుగురు ఉద్యోగులు
రైతులకు పనులు చేసిపెట్టడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ శాఖలో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మొదట 1995లో బో యిన్‌పల్లికి చెందిన ఓ రైతు పేరిట పొలం మార్చడానికి రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్‌ఐ పెంటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత 1997లో ముచ్చర్లపల్లికి చెందిన రైతు శ్యాంసుందర్‌రెడ్డికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడాని కి రూ.3 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ ఇంజనీర్ అబ్దుల్‌రబ్ పట్టుబడ్డాడు. అలాగే 2013 ఏప్రిల్ 1న జకినాలపల్లికి చెందిన పోలే శంకర్‌ను ఓ కేసు విషయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్‌ఐ సాయిచంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా విద్యుత్ ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏడాది క్రితమే ఇక్కడికి..
విద్యుత్ ఏఈ పర్వతాలు కేఎల్‌ఐ కాల్వ సమీపంలో రైతుల పొలాలు లేకపోవడంతో, అదే అదునుగా చూపించి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి రైతుల నుంచి భారీగా లంచాలు వసూలు చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై మొదటి వారంలో బాలానగర్ నుంచి బదిలీపై ఏఈ పర్వతాలు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి న తర్వాత కేఎల్‌ఐ కాల్వ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రతి రైతు నుంచి డబ్బులు వసూలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈయన బాగోతం బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment