వీరి చావుకి కారణం​ ఎవరు? | Eleven Deaths Occurs At Fire Accident In Chennai Forest | Sakshi
Sakshi News home page

కన్నీటి చిచ్చు

Published Wed, Mar 14 2018 7:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Eleven Deaths Occurs At Fire Accident In Chennai Forest - Sakshi

మృతులు: దివ్యా – వివేక్‌ దంపతులు, అరుణ్‌ ప్రభాకర్, అఖిల, పునిత, శుభ, వేళచ్చేరి నిష (ఫైల్‌)

తేని జిల్లా బోడినాయకనూరు కురంగని కొండల్లో రేగిన కార్చిచ్చు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది.  కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం నాటికి పది మంది మృతి చెందగా మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్‌కు చెందిన దివ్య (25) మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. దివ్య భర్త వివేక్‌ ఇదే కార్చిచ్చులో సోమవారమే మృతి చెందాడు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఎవరు కదిలించినా కన్నీటి గాథను చెబుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు చిన్నారులు సహా 36 మంది కురంగని కొండల్లో ట్రెక్కింగ్‌ నిర్వహిస్తూ కార్చిచ్చులో చిక్కుకున్న సంగతి పాఠకులకు విధితమే. అగ్నికీలలకు ఆహుతైన వారంతా ఐటీ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివినవారు, కొత్తగా పెళ్లయిన దంపతులు కావడం విచారకరం. కన్యాకుమారి జిల్లాకు చెందిన విపిన్‌ (30) చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి. తన సహోద్యోగిని దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. కడలూరు జిల్లాకు చెందిన శుభ (28) చెన్నై షోళింగనల్లూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖ నేత కుమార్తె శుభ తన స్నేహితురాలు అఖిల ట్రెక్కింగ్‌కు వెళ్లడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వెంటవెళ్లి అఖిలతోపాటు ప్రాణాలు కోల్పోయింది.. మదురై జిల్లాకు చెందిన హేమలత (30) ఒక హెచ్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగిని. చెన్నై వేలాచ్చేరిలోని ఒక ఐటీ సంస్థ ఉద్యోగిని చెంగల్పట్టు జిల్లాకు చెందిన పునిత (26) ప్రాణాలు కోల్పోయి, రెండేళ్ల ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగైన భర్త బాలాజీకి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈరోడ్‌ జిల్లాకు చెందిన తమిళ్‌సెల్వన్‌ (26) చెన్నైలోని ఒక ప్రముఖ టైర్ల కంపెనీ ఉద్యోగి. ఈరోడ్‌ గౌతంపాడికి చెందిన వివేక్‌ (28) దుబాయ్‌లో పనిచేస్తుండగా, భార్య దివ్య (26)తో కలిసి ట్రెక్కింగ్‌ వెళ్లి ప్రాణాలు విడిచారు. వీరికి వివాహమై వందరోజులు మాత్రమేకాగా ఇంతలోనే వీరిద్దరికి నూరేళ్లు నిండిపోయాయి. కుంభకోణంకు చెందిన అఖిల (27) వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. చెన్నై నంగనల్లూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. చెన్నై హార్బర్‌లో పనిచేస్తున్న విరుదునగర్‌ జిల్లాకు చెందిన ప్రభాకరన్‌ (28), కొండలు ఎక్కడంలో శిక్షణ కూడా ఇస్తుంటాడు.  చెన్నై వేలాచ్చేరికి చెందిన నిషా (20) చెన్నై మనపాక్కంలోని ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

కన్నీరు తెప్పించిన సంఘటనలు:
సహాయక చర్యలు చేపట్టినవారి కళ్లను చెమర్చిన సంఘటనలు అనేకం ఎదురయ్యాయి. కురంగని పరిసరాలకు చెందిన 30 మంది కొండలు, గుట్టలు ఎక్కుతూ బాధితులను వెతుక్కుంటూ అందరికంటే ముందుగా   బయలుదేరారు. కొండలోతుల్లో పడిపోయిన వారు ఆవేదనతో పెట్టిన కేకలను విని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారంతా ఒంటిపై గుడ్డలు సైతం కాలిపోయి దయనీయావస్థలో చిక్కుకుపోయారు. మరికొందరు దాహం దాహం అంటూ కేకలు వేయడం, ఎలాగైనా మా ప్రాణాలు కాపాడండి...నా పేరు వివేక్‌ అంటూ ఒక యువకుడు మూలగడం బా«ధాకరంగా మారింది. డోలీల్లో వస్తున్న తమ వారిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. 108 అంబులెన్స్‌లు అక్కడి చేరుకోగా కాలిన గాయాలతో తీవ్రంగా రోదిస్తున్న క్షతగాత్రులను గుర్తించి కురంగని ప్రభుత్వ ఆస్పత్రులకు చేర్చారు. అయితే కాలిన గాయాలకు అత్యవసర చికిత్సకు అవసరమైన ఎస్‌ఎస్‌టీ అనే సిల్వర్‌ సల్పాడయోడిన్‌ అనే మందు ఆస్పత్రిలో లేదు. దీంతో మదురై, తేనీ జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులకు కబురంపగా వారు కూడా లేదన్నారు.

ఈ సమయంలో కేంద్రసహాయ బృందాలు వెంటతెచ్చిన మందులతో చికిత్స ప్రారంభించాల్సి వచ్చింది. అంతవరకు క్షతగాత్రులంతా బాధను తట్టుకోలేక రోదిస్తూ గడపడం సహాయక సిబ్బందిని కన్నీరుపెట్టించింది. అగ్నికీలలు చుట్టుకుంటున్న దశలో అటవీశాఖ వాచర్‌ బైటపడేమార్గం చూపుతూ ముందు వెళుతుండగా 12 మంది అతన్ని అనుసరించారు. అయితే చెన్నైకి చెందిన 24 మంది వాచర్‌ చూపుతున్న మార్గంలో వెళ్లకుండా స్వతంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేడిగాలులతో మంటలు సమీపించడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు కొండపై నుంచి లోతుల్లోకి దూకారు. దీని వల్ల తీవ్రంగా గాయపడడంతో కదల్లేక పోయారు. ఇంతలో  మంటలు వారి ప్రాణాలను హరించివేశాయి. కాలినగాయాలతో విలవిలలాడుతున్న ఇద్దరు యువతుల ఒకరినొకరిని పట్టుకుని మనల్ని దేవుడే కాపాడాలని అని కన్నీరుకారుస్తుండగా హెలికాప్టర్‌ వచ్చి వారిపై ఎగరసాగింది. దీంతో సంతోషంతోపడిన వారిద్దరూ అదిగో దేవుడు వాహనం పంపాడని సహాయక సిబ్బంది ఆసరాతో హెలికాప్టర్‌ ఎక్కి సురక్షితంగా బైటపడ్డారు. ఈ విషయాలను వైమానికి సిబ్బందికి వారే చెప్పుకుని కృతజ్ఞతలు తెలిపారు. కురంగని ప్రమాదం సహాయక చర్యల్లో వైమానికదళం ప్రముఖ పాత్ర పోషించింది. పేరుకు తగ్గట్లుగా వాయువేగంతో సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలను కాపాడింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ సాగిస్తూ ప్రశంసనీయమైన పాత్ర పోషించారు.

అటవీ దొంగలే అగ్గికి కారణమా:
కురంగని కొండల్లో అకస్మాత్తుగా అగ్గిపుట్టడం అటవీ దొంగల పనేనని అనుమానిస్తున్నారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఎలా పుట్టింది, ప్రకృతిపరమైన సంఘటన లేక మరేదైనా కోణం ఉందాని ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేక పోతోంది. అయితే అటవీ సంపదపై పూర్తి అవగాహన ఉన్న మాజీ అధికారులు, సామాజిక సేవకులు మాత్రం పలుకోణాల్లో అరాతీయడం ప్రారంభించారు. అటవీప్రాంతాల్లోని వృక్షాలను ఆయాశాఖ అధికారులు ప్రతిఏడాది లెక్కకడతారు. ఎక్కడైనా వృక్షాలు నరికివేసినట్లు కనపడితే అటవీ సిబ్బందిని విచారించి నష్టపరిహారాన్ని జీతాల నుంచి మినహాయిస్తారు. సిబ్బంది ఇచ్చే వివరణ సమంజసంగా ఉంటే సదరు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అవినీతి, అక్రమమని తేలితే శాఖాపరమైన కఠిన శిక్షకు గురిచేస్తారు. ఇరుకుగా ఉంటే ప్రాంతాల్లో మూంగిల్‌ వృక్షాలు ఒకదానికి ఒకటి రాసుకుని అగ్గిపుట్టే అవకాశం ఉంది.  అయితే కురంగని కొండల్లో మూగింల్‌ వృక్షాలు అతికొద్దిగా ఉన్నందున అగ్నిరాజుకునే అవకాశాలు చాలా తక్కువ. పశువులు మేపేవారు, నాటుసారా కాచేవారు, అసాంఘిక శక్తులు కొండల్లోకి వెళ్లి తమ అవసరాల కోసం నిప్పురాజేసే అవకాశం ఉంది. అడవుల్లోని పచ్చగడ్డిని పశువులు ఆహారానికి అధికారులు అనుమతిస్తుండగా, ఈసాకుతో అడవుల్లోకి వెళ్లి చెట్లను నరికి సొమ్ముచేసుకునే వారు కొందరు తయారయ్యారు. దీంతో పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లడాన్ని అధికారులు నిషేధించారు. కేవలం పశువుల దాణా కోసం అడవుల్లోకి వెళ్లేవారు ఏ కారణం చేతనూ నిప్పురాజేయరని, దొంగతనంగా అటవీ సంపదను అమ్మి సొమ్ముచేసుకునే వ్యక్తులు అధికారుల దృష్టి మరల్చేందుకు నిప్పురాజేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అటవీ దొంగల స్వార్థం అమాయకుల ప్రాణాలను బలిగొందని అంటున్నారు. అటవీ కార్చిచ్చు ప్రకృతి ప్రకోపమా,  అరాచక శక్తులు సృష్టించిన ప్రమాదమా విచారణ జరపాలని నటుడు సత్యరాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పర్యతారోహణ శిక్షణ కేంద్రాల జాబితా, వారి పనితీరు, కార్యకలాపాలపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది.

అధికారి సస్పెన్షన్‌
కురంగని కొండల్లో అగ్నిప్రమాదంలో చిక్కుకుని 11 మంది మృతి చెందిన సంఘటనపై బాధ్యుడిని చేస్తూ అటవీశాఖ అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తేని జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారి రాజేంద్రన్‌ మంగళవారం శాఖాపరమైన విచారణ జరిపారు. ఫారెస్టర్‌ జెయ్‌సింగ్‌ అనే వ్యక్తిని సస్పెండ్‌ చేశారు. అటవీశాఖ అనుమతి పొందకుండా కోండపైకి తీసుకెళ్లిన ప్రయివేటు సంస్థపై చర్య తీసుకోవాలని ఎస్‌టీపీఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. 

అనుమతితోనే ట్రెక్కింగ్‌:
అటవీశాఖ అనుమతి లేకుండా వెళ్లడమే పలువురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం ప్రకటించారు. అయితే వారంతా ఒకరికి రూ.200 చొప్పున చెల్లించి, పాస్‌ను సైతం పొంది అనుమతి పొందిన తరువాత కొండ ఎక్కినట్లు తేలింది. 

గవర్నర్‌ పరామర్శ
అడవుల్లో రేగిన కారుచిచ్చులో చిక్కుకుని మృతి చెందిన వారికి గవర్నర్‌ బన్వరిలాల్‌ సంతాపం ప్రకటించారు. మంగళవారం మదురై ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.  బిడ్డలను, బంధువులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement