తొంగడదీవి రోహిత్ (ఫైల్)
అక్కిరెడ్డిపాలెం(గాజువాక)/ఆరిలోవ(విశాఖ తూర్పు): కుటుంబానికి అంది వస్తాడనుకున్న కొడుకుని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేయడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూపరులను కలిచివేస్తున్నాయి. ప్రైవేట్ గుమస్తాగా పనిచేస్తున్నప్పటికీ కుమారులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని కలలుకన్న ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. వీకెండ్ స్నేహితులతో గడిపేందుకు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రుషికొండ సమీపంలో బీచ్‌రోడ్డులో శనివారం అర్థరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇంజినీరింగ్ విద్యార్థి రోహిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 59వ వార్డు నాతయ్యపాలెంకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న తొంగడదీవి కాశీనాథ్, పద్మావతిలకు రోహిత్ (21), ఇంటర్ చదువుతున్న గుణంత్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రోహిత్ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గల మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఆర్‌కే బీచ్‌లో తన స్నేహితుడు పుట్టినరోజు వేడుకకు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. రోహిత్‌తోపాటు మరో స్నేహితుడు విక్టర్ పాల్ కలిసి బైక్‌పై రుషికొండ వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్నేహితులకు రోహిత్ ఫోన్ చేశాడు. ఆర్‌కే బీచ్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నామని... అక్కడకు రావాలని స్నేహితులు చెప్పడంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో రోహిత్, పాల్ కలిసి బయలుదేరారు. రుషికొండ కూడలి వద్ద బైక్ టర్న్ తిప్పారు. ఆ సమయంలో బైక్ అదుపు తప్పడంతో అక్కడే ఓ షాపు వద్ద టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులను బైక్‌తో ఢీకొట్టి పల్టీకొట్టారు. దీంతో బైక్ వెనుక కూర్చొన్న రోహిత్ కిందపడి తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
బైక్ నడుపుతున్న విక్టర్ పాల్‌తో పాటు టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు అమర్‌జాన్, బిషప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఆరిలోవ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, విక్టర్‌పాల్‌ను కేజీహెచ్‌కు తరలించారు. పాల్ ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పాల్ అచ్యుతాపురం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. విషయం తెలుసుకొన్న మృతుని తండ్రి కాశీనాథ్ ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు. అతని ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం రోహిత్ అంత్యక్రియలు స్వస్థలం నాతయ్యపాలెంలోని శ్మశానవాటికలో ఆశ్రునయనాల మధ్య నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment