వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ చంద్రశేఖర్
లింగంపేట(ఎల్లారెడ్డి): గతనెల 20వ తేదీన ప్రజాప్రతినిధులు, అధికారులపై అసభ్య పదజాలంతో ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసిన సైబర్ క్రైం నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం లింగంపేట మండలకేంద్రంలో ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు.
లింగంపేట మండలం సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన రాందాస్ రాజేశ్వర్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన చిన్నప్ప సంతోష్ ఫోన్ నంబరుపై తన ఫోన్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇందుకు సంతోష్ ఫోన్ నంబరుపైనే పాస్‌వర్డ్ ఉన్న విషయం తెలుకొని సంతోష్ పేరుపైనే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో గతనెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు సంపత్‌గౌడ్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, తనతండ్రి వెంకగౌడ్‌తోపాటు పలువురిపై అసభ్య పదజాలంతో ఫేస్‌బుక్‌లో మెస్సేజ్‌లు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైంగా నమోదు చేసి విచారణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్ మెయిన్ బ్రాంచ్‌కి సమాచారం ఇచ్చి సదరు మెసేజ్ ఎక్కడి నుంచి, ఎవరి పేరుపై ఉంది, ఎవరు చాటింగ్ చేశారు అని విచారణ చేయగా జియో ఫోన్ నంబర్ తీసుకున్న ఐడీ ప్రూప్ ద్వారా కేసును ఛేదించినట్లు ఆయన పేర్కొన్నారు.
నిందితుడు రాందాస్ రాజేశ్వర్‌గౌడ్‌ను విచారణ చేయగా పాతకక్షలతో ఇలా చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. రాజేశ్వర్‌గౌడ్, సంతోష్‌కు చెందిన పంట చేలు పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలం క్రితం సంతోష్ తన పొలంలోకి రాజేశ్వర్‌గౌడ్ పొలం మీదుగా విద్యుత్ వైర్లు తీసుకెళ్తుండగా వైరు సరిపోకపోవడంతో తీగలు మధ్యలోనే వదిలేశాడు. అయితే విద్యుత్ తీగలు తన పంట చేనులో సంతోష్ వదిలివేసింది గమనించిన రాజేశ్వర్‌గౌడ్ తమను చంపడానికే వైర్లు వదిలేశావని గొడవ పడ్డారు. సంతోష్‌ను ఎలాగైనా పోలీసులతో కొట్టించాలని కక్షకట్టిన రాజేశ్వర్‌గౌడ్, సంతోష్ ఫోన్ నంబరుపై ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి పలువురిపై అసభ్యంగా మెస్సేజ్‌లు పెట్టినట్లు తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సుధాకర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది అనిల్, రాజు, హన్మాండ్లు, శ్యామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment