కనీసం మూడో తరగతి విద్యార్హత కూడా లేదు. అయితేనే యువతులను మోసం చేయడంలో మాత్రం దిట్టగా మారాడు. మత బోధకుడి అవతారమెత్తి ప్రార్థనసభ ముసుగులో యువతులను లోబరుచుకుని లైంగిక దాడులకు పాల్పడ్డాడు. 50 మంది బాధితుల్లోని ఐదుగురు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాపంపండిఅరెస్టయ్యాడు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లా మేక్కామండపంకు చెందిన రెండోతరగతి మాత్రమే చదువుకున్న ఒక వ్యక్తి మతబోధకుడిగా ప్రచారం చేసుకుంటూ ప్రార్థనాసభను ప్రారంభించాడు. వివాహ యోగం, భర్తతో సఖ్యత, విదేశాల్లో ఉద్యోగం వంటి తమ కుటుంబ కష్టాలను తీర్చుకునేందుకు తనవద్దకు వచ్చే ధనిక యువతులకు ఊరట కలిగించే మాటలు చెప్పి లైంగికంగా లోబరుచుకునేవాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా వీడియోగా చిత్రీకరించేవాడు. తరువాత ఆ దృశ్యాలను వారికి చూపి బెదిరించి రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. ఇలా సుమారు 50 మందికి పైగా యువతులు, మహిళలు మోసపోయినట్లు సమాచారం. మతబోధకుడి మోసాలను అర్థం చేసుకుని తాము ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కోరినా, మరో సభకు వెళ్లినా లైంగిక వీడియో దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతానని తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేసేవాడు.
ఇతని అరాచకాలను సహించలేని ఐదుగురు యువతులు తగిన ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ధన, జనం బలం మెండుగా కలిగి ఉన్న ఈ నకిలీ మత బోధకుని ఘోరాలు రచ్చకెక్కడంతో కొన్నినెలల క్రితం పారిపోయాడు. బాధిత మహిళల ఫిర్యాదును గోప్యంగా ఉంచి క్రైంబ్రాంచ్ పోలీసులు రహస్య విచారణ ప్రారంభించారు. నాగర్‌కోవిల్ ఎస్‌ఐ మోహన్ అయ్యర్ గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ బోధకుడు తన స్నేహితులతో కలిసి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. వారిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో అతడు పారిపోయేందుకుప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించేందుకు వీలుకాకుండా నకిలీ పాస్‌వర్డ్ ఇవ్వడంతోపాటు తన సెల్‌ఫోన్ ఓపెన్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించడంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఆ తరువాత పోలీసులతో ఘర్షణపడి ఆసుపత్రిలో అడ్మిట్‌కాగా పారిపోకుండా బందోబస్తు పెట్టారు. నకిలీ మత బోధకుడిని ఇంకా ఉపేక్షించకుండా అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు పోలీసులతో మొరపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment