
ప్రతీకాత్మక చిత్రం
బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో కలకలం రేపిన దొంగనోట్ల వ్యాపారుల ముఠాకు రాజకీయ అండదండలున్నాయా? పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను వదిలేయాలని పోలీసులపై స్థానిక నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఇటీవల కాలంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది.
తరచూ మద్యం దుకాణాలు, ఇతర హోల్‌సేల్ దుకాణాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల దీనిపై పోలీసులు నిఘా పెంచి దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మద్యం దుకాణాలు, ఇతర రద్దీగా ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలోనే ఈ తతంగం గుట్టుచప్పుడుగా జరుగుతున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోని తాండ్రపాపారాయ జంక్షన్‌లో పూల దుకాణం నిర్వహిస్తున్న తిరుపతిరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
అతనికి సహాయకుడిగా దుకాణంలో పనిచేస్తున్న షేక్‌పీర్, మరో వ్యక్తి తౌడులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. షేక్ పీర్ పట్టణంలోని పేదలుండే ఇందిరమ్మ కాలనీలో నివసిస్తూ అక్కడే దొంగనోట్లను భద్రపరచి చలామణి చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వీరిని పట్టుకున్న తరువాత బొబ్బిలి దాడితల్లి అమ్మవారి పండగ జరుగడం, పోలీసులకు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో పట్టుకున్న నిందితులను అరెస్టు ప్రకటించలేదని సమాచారం.
విచారణలో వివిధ అంశాల పరిశోధనపై కూడా మరికాస్త సమయం అవసరమున్న నేపథ్యంలో డీఎస్పీ పి.సౌమ్యలత ఆదేశాలను సీఐ మోహనరావు, ఎస్సైలు వి.ప్రసాదరావు, బి.రవీంద్రరాజులు పాటిస్తున్నట్టు భోగట్టా.
కొత్త నోట్లు వచ్చిన కొత్తలోనే..?
కొత్త నోట్లు చలామణీకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సమయంలోనే దొంగనోట్లను సిద్ధం చేసే సిద్ధహస్తులు బొబ్బిలిలోనే ఉన్నారా? లేక వీరి వెనుక ఇంకెవరయినా ఉన్నారా అన్నది ఇప్పడు పోలీసుల ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం వెతికే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు అధికంగా ఉన్న బొబ్బిలిని దొంగనోట్ల చలామణికి అక్రమార్కులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ ఒత్తిళ్లు..?
పోలీసుల అదుపులో ఉన్నవారిని విడిపించేందుకు, కేసులు మాఫీ చేసేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు తిరుపతిని కేసులోంచి బయటపడేసేందుకు ముగ్గురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. అయితే, పోలీసులు ఒత్తిళ్లను ఖాతరు చేయడం లేదని, దొంగనోట్ల చలామణిని ప్రోత్సహిస్తారా అంటూ సదరు నేతలను తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో మూలాలను వెతకడంలో భాగంగా పొరుగు జిల్లాలైన శ్రీకాకుళంలోని రాజాం, విశాఖపట్నంలకు వెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment