ఆస్పత్రిలో మృతదేహాలు ,మేఘల (ఫైల్)
వారంతా చిన్నపాటి వ్యాపార లావాదేవీల్లో నిత్యం తలమునకలై ఉండేవారు. వేసవి సెలవులు రావడంతో సరదాగా విహారయాత్రకు కారులో బయలుదేరారు. కారు కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి బయలుదేరింది. పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో ఎదురుగా మరోకారు వచ్చి బలంగా ఢీకొంది. విహార యాత్రకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది.
తమిళనాడు, కాంచీపురం: విహారయాత్రకు ఉల్లాసంగా కారులో బయలుదేరిన కుటుంబాన్ని గురువారం రాత్రి మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ సంఘటన పెరంబలూరులో చోటుచేసుకుంది. ఇందులో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబీకులు తొమ్మిదిమంది మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెరంబలూరు జిల్లా, పెరంబలూరు కల్యాణనగర్ ప్రాంతానికి చెందిన శక్తి శరవణన్ మాజీ సైనికుడు. ఇతను తిరుచ్చిలో తన స్నేహితుడి కారును తీసుకుని పెన్నాడంకు వ్యక్తిగత పనిపై గురువారం అర్ధరాత్రి బయలుదేరారు. ఈ కారు పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్‌ను స్వల్పంగా ఢీకొంది. తర్వాత కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి విహారయాత్రకు వస్తున్న కారును ఢీకొంది. విహారయాత్రకు వస్తున్న కాంచీపురం కుటుంబీకుల కారు నుజ్జునుజ్జు అయ్యింది.
వీరంతా కాంచీపురంలోని చిన్న కాంచీపురం తిరుమలై నగర్ పళనియప్పన్ వీధికి చెందిన వారు. వీరంతా శిథిలాల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పెరంబలూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని కారులోని మృత దేహాలను చాలాసేపు శ్రమించి వెలికితీశారు. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న కాంచీపురం వాసులు తొమ్మిది మందిమృతి చెందారు. వారి వివరాలు ఇలావున్నాయి. మోహన్ (39), భార్య లక్ష్మి (32), కుమార్తెలు పవిత్ర (13), నవిత (10), కుమారుడు వరదరాజన్ (05), మురళి (56), మేఘల (17), డ్రైవర్లు ప్రభాకరన్ (32), భూపతి (27) మృతి చెందారు. మృతి చెందిన మోహన్ ఎస్‌ఆర్‌ఎం సిల్క్స్ అండ్ గణేష్ శారీస్, ఎస్‌ఆర్‌ఎం ట్రావెల్స్ సంస్థలను నడుపుతున్నారు. మృతి చెందిన వారిలో మేఘల కాంచీపురంలో గల కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందిన సంఘటన కాంచీపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment