
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త భార్యను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ నగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్, స్వప్నకు మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే, 15 ఏళ్ల క్రితమే వెంకటేశ్‌కు మరో మహిళతో వివాహమైంది. దీంతో మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేశ్ తరచూ స్వప్నతో గొడవకు దిగేవాడు. మొదటి భార్య కారణంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్ స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో పాటు రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆందోళనకు గురైన వెంకటేష్ భార్యను చంపిన వెంటనే తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్, స్వప్న మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి
Comments
Please login to add a commentAdd a comment