ప్రవీణ్ పటేల్ కుటుంబం (ఫైల్)
సాక్షి, ముంబై : ఓవైపు అప్పుల బాధ, మరోవైపు కూతురి మరణం వెరసి ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కఫే పరేడ్‌కు చెందిన ప్రవీణ్ పటేల్, భార్య వీణా పటేల్, కొడుకు ప్రభు పటేల్‌తో కలిసి మత్స్యకారుల కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండేవాడు. కొన్ని నెలల క్రితం అతని కూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందింది. కూతురి మరణంతో పాటు అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది.
ముందుగా కొడుకును ఉరివేసి, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ప్రవీణ్ ఇంటి నుంచి దుర్వాసన రావటం గుర్తించిన పొరుగింటి వారు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరచిచూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన ఓ సూసైడ్ నోట్‌లో మృతులు దాదాపు 50 మంది పేర్లను ప్రస్తావించటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇంటి సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా... ఆత్మహత్య చేసుకునేలా ఎవరన్నా ప్రేరేపించారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment