
కుటుంబీకులు మరణించిన ఇల్లు
భువనేశ్వర్/రాజ్‌గంగపూర్: సుందర్‌గడ్ జిల్లాలోని రాజ్‌గంగపూర్ ప్రాంతంలో ఇంటిల్లపాది ఒక్కసారిగా మృతి చెందిన సంఘటన కారణాలు అనుమానస్పదంగా కనిపిస్తున్నాయి. సుందర్‌గడ్ జిల్లాలోని రాజగంగపూర్ ఐటీ కాలనీ బి/7 నంబరు ఇంటిలో అద్దెకు ఉంటున్న భర్త రంజిత్ ప్రసాద్ (28), భార్య కల్పన ప్రసాద్, ఇద్దరు పిల్లలు కొద్దిరోజుల క్రితం ఇంటిలోనే చనిపోగా ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక జారీకావడంతో సందిగ్ధతకు తెర క్రమంగా తొలగుతోంది. మొదట సంఘటన స్థల పరిసరాల దృష్ట్యా వారిది ఆత్మహత్యగా అంతా భావించారు.
కుటుంబీకులంతా విషం తాగి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం అది విష ప్రయోగం కాదని తేలింది. ఊపిరాడకపోవడంతో వారంతా మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి గదిలో ఓ చలి కుంపటి ఉన్నట్లు గుర్తించారు. చలి నుంచి ఉపశమనం పొందడం కోసం వారు చలికుంపటి పెట్టుకోగా నిద్రపోయే సమయంలో ఆ కుంపటి సెగకు వారంతా మరణించి ఉంటారని తేలింది. ఇదిలా ఉండగా కిటికీలతో సహా తలుపులు కూడా మూసేయడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తదుపరి ఉన్నత పరీక్షలకు సిఫారసు చేయగా ఆ పరీక్షల నివేదిక అందితే కానీ కుటుంబం మరణం వెనక కారణాలు స్పష్టం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒడిశా
Comments
Please login to add a commentAdd a comment