మృతి చెందిన ఆనంద్, తనుజశ్రీ (ఫైల్)
కంటైనర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబానికి శాపమైంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ముచ్చటగా సాగుతున్న కాపురంపై రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పంజా విసిరింది. కంటైనర్ లారీ బైక్‌ను ఢీ కొన్న ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందగా, తల్లీ, మరో కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలకు పోరాడుతున్నారు. నిర్లక్ష్యం, మద్యం మత్తు వెరసి పచ్చని కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాయి.
తిరువొత్తియూరు: చెన్నై పాడి వంతెన వద్ద ఆదివారం రాత్రి మోటారు సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నై విల్లివాక్కం జీకేఎం కాలనీ 47వ వీధికి చెందిన ఆనంద్ (38). చెన్నై వడపళనిలో ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనూష. వీరికి తనుజాశ్రీ (9), కాంచన (3) ఇద్దరు కుమార్తెలు. విల్లివాక్కంలోని ప్రైవేటు పాఠశాల్లో తనుజాశ్రీ 3వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఆనంద్, భార్య పిల్లలతో కలిసి వస్తువులు కొనడానికి పాడిలో దుకాణానికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వస్తుండగా పాడి వంతెన వద్ద బైక్‌ను వెనుక వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆనంద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో తనూజాశ్రీ మృతి చెందింది. అనూష, కాంచనలకు చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూందమల్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కంటైనర్ లారీ డ్రైవర్ కాంచీపురం కొంగులాచేరికి చెందిన మనోహరన్ అని, అతను మద్యం మత్తులో లారీని నడిపినట్టు తెలిసింది. మనోహరన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment