క్షతగాత్రులను యానాం ప్రభుత్వాస్పత్రి అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం
తాళ్లరేవు (ముమ్మిడివరం): జాతీయ రహదారి 216లోని కొత్త కోరంగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు చెక్కా అచ్చిబాబు(35), చెక్కా మనోజ్ హర్ష(6) దుర్మరణం పాలయ్యారు. కోరంగి ఎస్సై వీఎల్‌వీకే సుమంత్ కథనం ప్రకారం.. పటవల పంచాయతీ రామన్నపాలెం గ్రామానికి చెందిన అచ్చిబాబు తన భార్య నాగమణి, కుమారులు మనోజ్ హర్ష, ధోని, కుమార్తె సాక్షిలతో కలిసి రామన్నపాలెం నుంచి చినబొడ్డువెంకటాయపాలెం బైక్‌పై వెళుతుండగా.. కోరంగిలో అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఏపీ05ఈఏ 1026 కారు అతివేగంగా వచ్చి ఢీకొంది.
ఈ ప్రమాదంలో అచ్చిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా ఎంతకీ రాకపోవడంతో అదే సమయంలో ఆ రహదారిలో వెళుతున్న యానాం ప్రభుత్వాస్పత్రికి చెందిన అంబులెన్స్‌లో క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మనోజ్ హర్ష మృతి చెందాడు. ఇదిలా ఉండగా మూడేళ్ల ధోని, పదేళ్ల సాక్షికి తీవ్రగాయాలైనట్టు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన గుండే సుభాష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అతివేగం, వర్షం కారణంగా బ్రేకు పడకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కళ్లముందే భర్త, కుమారుడు చనిపోవడంతో నాగమణి బోరున విలపించడం అందరినీ కలచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment