
సోంపేట: కన్న బిడ్డ మృతికి కారణమైన కేసులో తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముద్దాయి మద్దిలి ధర్మారావును సోమవారం సోంపేట పోలీస్‌స్టేషన్‌లో కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్.వివేకానంద, ఇన్‌చార్జి సీఐ అవతారంలు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మందస గ్రామంలోని కాపు వీధికి చెందిన ఎం.ధర్మారావుకు అదే వీధిలోని సత్యతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉమమహేశ్వరరావు ఉన్నారు. ధర్మారావు తన తల్లి, అక్కల ప్రోద్బలంతో భార్య సత్యను మద్యం మత్తులో నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె తన కుమారుడితో కలిసి 8 నెలల క్రితం కన్నవారింటికి వెల్లిపోయింది. ధర్మారావు అత్తవారింటికి వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి ఆడుకున్న తర్వాత తిరిగి తన భార్య ఇంటికి పంపించేవాడు. ఇదే క్రమంలో సెప్టెంబరు 23న ధర్మారావు, భార్య సత్యల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన కుమారుడిని ఇంటికి తీసుకువచ్చి పురుగుల మందు తాగించి తాను కూడా సేవించాడు. కొద్దిసేపటి తర్వాత సత్య తన కుమారుడిని తీసుకురమ్మని తమ్ముడు çషణ్ముఖను ధర్మారావు ఇంటికి పంపించింది. అక్కడ విగతజీవులై పడి ఉన్న «ధర్మారావు, ఉమామహేశ్వరరావులను గుర్తించి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మారావుపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మారావు అక్క, తల్లిపై 498 ఎ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.