భారతి, కార్తికేయన్, కుమారుడు సభా (ఫైల్)
చెన్నై , అన్నానగర్ : భార్య మృతిచెందిన కొద్దిసేపటికే కుమారుడిని హత్య చేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మదురైలో గురువారం జరిగింది. వివరాలు.. మదురై కోవిల్ బాప్పాక్కుడి ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (42) పాత ఇనుప వస్తువుల వ్యాపారం చేసేవాడు. ఇతను పెరియార్ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ యజమాని కుమార్తె భారతి (37)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ఇద్దరి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినా పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాలు వీరితో మాట్లాడడం లేదు. కార్తికేయన్ భార్యతో కలిసి ఎస్.ఎస్.కాలనీలోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. వీరికి కుమారుడు సభా (13) ఉన్నాడు.
ఈ క్రమంలో భారతికి అనారోగ్యం చేసింది. చేతులు, కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. ఆమెను వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లినా వ్యాధి నయం కాలేదు. ఈ క్రమంలో గురువారం అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ ఆసైతంబి, కట్టణమ్ వసూలు చేయడానికి కార్తికేయన్ ఇంటికి వెళ్లాడు. చాలా సేపు తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో సాయంత్రం మరోసారి ఇంటికి వెళ్లి తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి లోపకలికి వెళ్లి చూశాడు. కార్తికేయన్ ఫ్యాన్‌కి శవంగా వేలాడుతూ కనిపించాడు. భారతి, సభా మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఈ ఘటన గురించి ఎస్.ఎస్.కాలనీ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు జాయింట్ కమిషనర్ శశిమోహన్, సహాయ కమిషనర్ వెట్రిసెల్వన్, ఇన్‌స్పెక్టర్ అరుణాచలం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. అక్కడ కార్తికేయన్ రాసిన లేఖ చిక్కింది. ఇందులో ‘నా భార్య వేకువజామున మృతి చెందింది. భార్య లేని లోకంలో జీవించడానికి నచ్చడం లేదు. నా కుమారుడు వికలాంగుడు కావడంతో అతన్ని చూసుకోలేని పరిస్థితి. కనుక నేను, నా కుమారుడు చనిపోతున్నాం’ అని రాసి ఉంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో భార్య మృతి చెందిన కొద్దిసేపట్లో కార్తికేయన్ కుమారుడిని దిండుతో ముఖంపై నొక్కి హత్య చేశాడని తెలిసింది. తరువాత అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment