
బాలిక జ్ఞానేశ్వరితో స్వీపర్
ద్వారకాతిరుమల: ఎవరి బంధాలకు అడ్డొచ్చిందో ఏమో గానీ ఈ బాలికను క్షేత్రానికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఓ ప్రబుద్ధుడు. స్థానిక కల్యాణ మండపంలో అనాథలా దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఉన్న ఈ బాలికను ఆలయంలో పనిచేసే స్వీపర్ అయినవల్లి దేవి అక్కున చేర్చుకుంది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం. తాడేపల్లిగూడెం సమీపంలోని కుచ్చనపల్లికి చెందిన పదేళ్ల గోలి జ్ఞానేశ్వరిని మంగళవారం ఉదయం ఒక వ్యక్తి ద్వారకాతిరుమల తీసుకొచ్చి స్వామివారి కల్యాణ మండపంలో విడిచిపెట్టాడు.
అతడు వెళుతూ నువ్వు ఇకపై ఇక్కడే ఉండాలి.. వెళ్లి బట్టలు తెస్తాను, అప్పుడప్పుడు వచ్చి చూస్తానని చెప్పి వెళ్లిపోయాడు. తన తండ్రి కొన్నాళ్ల క్రితం మృతిచెందాడని, తన తల్లి బుజ్జి తరచూ వేధిస్తోందని బాలిక చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన పెదనాన్న ఇక్కడకు తీసుకొచ్చి వదిలివెళ్లారని చెప్పింది. తాను కుంచెనపల్లి ఎలిమెంట్రీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నట్టు బాలిక తెలిపింది. తన తల్లి కొట్టే దెబ్బలు భరించలేక పోతున్నానని, ఆమె వద్దకు తనను పంపవద్దని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment