
గుంటూరు: వడ్డీకి డబ్బులు తీసుకుంటే.. ఆ వడ్డీ వ్యాపారి, తనకు పరిచయస్తుడైన వ్యక్తితో కలసి లైంగిక వేధింపులకు దిగడంతో సోమవారం ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు కలెక్టరేట్‌లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో షేక్ అజీమున్నీసా సీనియర్ అసిస్టెంట్. 2009లో భర్త హుసేన్ మరణానంతరం ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం స్వగ్రామం నరసరావుపేటకు చెందిన ఇన్నమూరి మాధవరావు ద్వారా వడ్డీ వ్యాపారి మట్టా ప్రసాదు వద్ద రూ.5 వడ్డీకి రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులిచ్చింది.
ప్రతి నెలా రూ.15 వేలు వడ్డీ చెల్లిస్తోంది. అయినా వారిద్దరూ ఒత్తిడి చేసి ఏటీఎం కార్డు కూడా తీసుకున్నారు. రెండున్నరేళ్లలో రూ.8 లక్షలు డ్రా చేసుకున్నా.. అప్పుతీరలేదంటూ కోర్టులో కేసు వేశారు. కేసు తొలగించాలన్నా తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. దీనిపై రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం డీపీవో ఆవరణలోని క్యాంటీన్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. వడ్డీ వ్యాపారి వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని బాధితురాలికి అండగా నిలవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వివరాలను సేకరించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment