ఆనంద్‌రెడ్డి అద్దెకు ఉన్న గదిని పరిశీలిస్తున్న పోలీసులు , ఫైనాన్సర్ ఆనంద్ రెడ్డి
సాక్షి, తుర్కపల్లి(ఆలేరు): అతనో వికలాంగుడు.. ఏప్రాంతంవాడో తెలియదు.. చిరువ్యాపారులకు డబ్బులు అప్పుగా ఇస్తూ ఫైనాన్సర్‌గా మారాడు. అయ్యప్పమాల వేసి పరమభక్తుడిగా నటించాడు.. పండుగలొస్తేచాలు హంగూఆర్భాటాలతో పూజలు చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. అన్నదానాలూ చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ధనవంతుడినని నమ్మించాడు. తాను కొనుగోలు చేసిన భూములను తక్కువ ధరకు అమ్ముతానని కొందరిని నమ్మించి అడ్వాన్స్‌ల పేరిట రూ.51లక్షల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో రాత్రికిరాత్రే బిఛానా ఎత్తేశాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఆనంద్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ వికలాంగుడు నాలుగేళ్లక్రితం ఓ చిన్నపాటి సూట్‌కేసుతో తుర్కపల్లికి వచ్చాడు. తాను ఫైనాన్సర్‌అని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి కావాల్సిన ఏసీలు, ఫ్రిజ్, టీవీ, సోఫాలు, ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేశాడు. తను ఉండే ఇంట్లో పరమభక్తుడిలా రోజూ పూజలు చేస్తూ చుట్టపక్కల వారికి ప్రసాదాలు పంచేవాడు. దీపావళి పండుగ వస్తే ఘనంగా లక్ష్మీపూజ చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. తుర్కపల్లిలో చిరువ్యాపారులకు, ఆటోడ్రైవర్లకు ఫైనాన్స్ ఇచ్చి డెయిలీ వసూళ్లకు యువకులను సైతం తన దగ్గర ఉద్యోగులుగా పెట్టుకున్నాడు.
తాంత్రికస్వామిగా..
కార్తీకమాసం కంటే ముందే అయ్యప్పమాలధారణ చేసేవాడు. 23 సార్లు తాను మాలవేసుకున్న తాంత్రికస్వామిగా పరిచయం చేసుకున్నాడు. అయ్యప్ప పూజల సందర్భంగా పెద్ద ఎత్తున్న మండల కేంద్రంలో అన్నదానాలు చేసేవాడు. గుళ్లు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు రాసేవాడు. గణేశ్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు.
ఆర్థికంగా ఉన్న అయ్యప్ప భక్తులు, ప్రజలపై కన్ను
మాల వేసుకున్న భక్తుల్లో ఆర్థికంగా ఉన్నవారిపై ఓ కన్నువేసేవాడు.ఆ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న భూములను కొనుగోలు చేసానని భూమి జిరాక్స్ పత్రాలను వారికి చూపించేవాడు. ఎవరూ లేని సమయంలో ఆ భూముల వద్దకు తీసుకెళ్లి ఈ భూమి నేను అగ్రిమెంట్ చేసుకున్నానని నమ్మించే వాడు. ఆ భూములను తక్కువ ధరలకు మీకు అమ్ముతామని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అందరికీ తెలిస్తే భూమిని మీకు అమ్మనని స్పష్టంచేసేవాడు.
అనంతపురం వాసుడిగా..
మీరు ఏప్రాంతం నుంచి వచ్చారని ప్రజలు అడిగితే తనది అనంతçపురం అని, ధనవంతుల కుటుంబం అని నమ్మించాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ అని అడిగితే తన ఫొటోతో ఇతరుల ఫొటోలను జతచేసి మార్ఫింగ్‌చేసి కుటుంబ సభ్యులని చూపించాడు.
గురుస్వామిని నమ్మించి..
తుర్కపల్లికి చెందిన ఓగురుస్వామిని నమ్మించి రూ.36లక్షలు వసూలు చేశాడు. తాను బొమ్మలరామారంలోని మెయిన్‌రోడ్డులో భూమి కొనుగోలు చేశానని ఆ గురుస్వామిని అక్కడికి తీసుకెళ్లి చూయించాడు. ఇక్కడ 14 ఎకరాలు ఉందని దీనిని యజమానులు రూ.75వేలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారని తెలిపాడు. ఇందులో 5 ఎకరాల భూమని తాను వారి వద్దనుంచి రూ.5లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ భూమికి ఎకరం రూ.80లక్షల వరకు డిమాండ్ ఉందని కానీ గురుస్వామి కాబట్టి మీకు రూ.20లక్షలకు ఎకరం చొప్పున విక్రయిస్తానని చెప్పి నమ్మించాడు. ఇలా ఆ గురుస్వామినుంచి ఇటీవల రూ. 36 లక్షలు వసూలు చేశాడు.
మరో వ్యక్తి వద్దనుంచి రూ.5లక్షలు, ఓహోటల్ యజమాని వద్ద రూ.2.50లక్షలు, మరికొంతరి వద్ద కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ నెల 27న భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని రావాలని గురుస్వామికి చెప్పాడు. అయితే 27తేదీన ఫైనాన్సర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో గురుస్వామి ఆఫైనాన్సర్ ఇంటి వెళ్లివాకబు చేశాడు. పనిమీద రాత్రి బయటికి వెళ్లాడని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అతని వద్ద పనిచేసే వర్కర్లు చెప్పారు. మంగళవారం ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్ వచ్చింది. అతడు 51 లక్షల రూపాయల నగదు ,నగలతో ఆదివారం రాత్రి తన మూడుచక్రాల వాహనంపైన భువనగిరికి వెళ్లి బస్‌స్టాండ్‌లోని పార్కింగ్‌లో ఉంచి ఆటోలో పరారయ్యాడు. గురుస్వామితో పాటు మరో ఐదుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
ఎటువంటి ఆధారం దొరకకుండా..
ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆనంద్‌రెడ్డి వ్యవహరించాడు. అతడు వాడిన ఫోన్‌లు, సి మ్‌లతో పాటు వాహనం కూడా గ్రామస్తుల పే రుమీదనే కొనుగోలు చేశాడు. తన ఉంటున్న గది లో పలుబ్యాంక్‌లకు సంబంధించిన పాస్‌పుస్తాకా లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌కార్డులు, ప్రామిసరీ నోట్లు, వాహనాలు ధ్రువీకరణ పత్రాలు లభించాయి.
పలు జిల్లాల్లో కూడా కేసులు
ఆంధ్రరాష్ట్రంలోని అనంతపుం, తాడిపత్రి, చిత్తూ రు, మదనపల్లి, తిరుపతిలో అతని పై పలు కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment