
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వారిని సొంతూరి నుంచి గరివిడికి తరిమాయి. అక్కడి నుంచి సింహాచలానికి తరిమికొట్టి ఉసురు తీసుకునేలా చేశాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు, తన భార్యాకుమార్తెలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం బతుకు తెరువు కోసం గరివిడి మండలం కొండపాలెం వచ్చాడు. అక్కడా పూట గడవని స్థితిలో సింహాచలం వచ్చి శనివారం రాత్రి కుటుంబమంతా విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. వీరిలో తండ్రి, కూతురు మరణించగా.. తల్లి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
సాక్షి, ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : ఓ చిన్ని కుటుంబాన్ని అప్పులు కాటేశాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఇంటి పెద్దతోపాటు భార్య, కుమార్తె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో తండ్రీ కుమార్తె చనిపోయారు. తల్లి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. హృదయవిదారకరమైన ఈ ఘటన సింహాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా, గరివిడి మండలం, కొండపాలెం గ్రామం అటుకా కాలనీకి చెందిన దంపతులు సింహాద్రి ఈశ్వరరావు(46), చంద్రకళ(39), తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె చాందిని (13) శనివారం సింహగిరిపై వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగారు. కొంత సమయం గడిచిన తరువాత సాయంత్రం కూల్‌డ్రింక్‌లో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు కలుపుకుని తాగారు. అయితే తండ్రీ, కుమార్తె పూర్తిగా తాగేయగా చంద్రకళ దుర్వాసన భరించలేక విడిచిపెట్టేసింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడి ఉన్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం సీఐ రమణయ్య వెంటనే ఆ కుటుంబ సభ్యులను 108లో కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలో ఈశ్వరరావు, చాందిని మరణించారు. వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. చంద్రకళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె షాక్‌లో ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అప్పల బాధలు తాళలేక పురుగుల మందు తాగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఉపాధి కోసం వలస బాట
గరివిడి(చీపురుపల్లి): బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన ఈశ్వరరావు నాలుగేళ్ల కిందట ఉపాధి కోసం గరివిడి మండలం తాటిగూడ గ్రామానికి వలసవచ్చాడు. అనంతరం రెండేళ్ల తర్వాత కొండపాలెం పంచాయితీ హడ్కోకాలనీకి వలస వచ్చేశాడు. అతనికి భార్య చంద్రకళ, కుమారుడు సాయికృష్ణ(20), కుమార్తె చాందిని ఉన్నారు. గతంలో తాటిగూడ గ్రామంలో రంగు రాళ్ల ఉంగరాలు తయారు చేసేవాడు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంవతో కొండపాలెం పంచాయతీ హడ్కోకాలనీకి నివాసం మార్చుకున్నారు. బంగారం, వెండి వస్తువులు తయారు చేస్తూ కొండపాలెంలోని సూర్యసధనమ్ కోవెలలో పనిచేసేవాడు.
కుమార్తె చాందిని స్థానిక హైస్కూల్‌లో 9వ తరగతి, కుమారుడు సాయికృష్ణ విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కుమార్తె, భార్యను తీసుకుని సింహాచలం వెళ్లిన ఈశ్వరరావు అక్కడ ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునేంతగా అప్పులు ఏమున్నాయో తమకు తెలియని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment