న్యూఢిల్లీ: కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్, ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యకు(దివ్య స్పందన) భారీ షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని గోమతినగర్ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్ ఫొటోను సోమవారం రోజున రమ్య ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై లక్నోకు చెందిన న్యాయవాది సయీద్ రిజ్వాన్ అహ్మద్ గోమతినగర్ పోలీసులను ఆశ్రయించారు.
‘దేశ ప్రధాని ఖ్యాతిని దిగజార్చేలా రమ్య ట్వీట్ చేశారు. ప్రధాని పట్ల వారికి గల ద్వేషాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడిని, దేశ ప్రధానిని అంతర్జాతీయంగా చులకన చేసే విధంగా ట్వీట్ చేశార’ని రిజ్వాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రమ్యపై ఐపీసీ సెక్షన్ 124-ఏ(రాజద్రోహం)తోపాటు, సెక్షన్ 67(ఐటీ యాక్ట్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆమెపై కేసు నమోదు అయినట్టు వచ్చిన ఓ వార్తపై స్పందించిన రమ్య ‘అయితే మంచిది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
గత కొద్ది రోజులుగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కోనసాగుతున్న సంగతి తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో.. భాగస్వామిగా భారత్ సూచించిన రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే ఇటీవల ఆరోపించారు. దీని తర్వాత బీజేపీపై కాంగెస్ మరింతగా మిమర్శల దాడిని పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment