
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో సాహెబ్‌నగర్‌లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బస్సులోంచి కిందపడ్డ రబ్బరును అందుకునేందుకు ప్రయత్నించిన ఒకటో తరగతి విద్యార్థిని తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ఆరేళ్ల అంజలి వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్‌లో చదువుతోంది. ఈ రోజు ఉదయం పాఠశాలకు చెందిన బస్సు సాహెబ్‌నగర్ నుంచి విద్యార్థులను తీసుకుని వనస్థలిపురం వస్తోంది. ఈ నేపథ్యంలో బస్సులో కూర్చున్న అంజలి రబ్బరు కింద పడింది.
రబ్బరును అందుకునే ప్రయత్నంలో బస్సు నుంచి జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పాటుగా, బస్సు డోర్ వద్ద క్లీనర్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment