మురుగుకాలువలో 5 కిలోల ఆభరణాలు ! | Five Kgs Gold Jewellery Found in Chittoor Drainage Canal | Sakshi

మురుగుకాలువలో 5 కిలోల ఆభరణాలు !

Oct 22 2019 6:43 AM | Updated on Oct 22 2019 12:29 PM

Five Kgs Gold Jewellery Found in Chittoor Drainage Canal - Sakshi

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నెలకు రూ.11 వేల వేతనంతో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా దీన్ని కర్రతో తీయడం సాధ్యపడలేదు. కాలువలోకి దిగి దాన్ని చేత్తో బయటకు తీసి చూస్తే అది రాయి కాదు.. ఓ సంచి. గుండెల్లో ఏదో అలజడి రేగింది. ఇద్దరు కార్మికులు కాస్త పక్కకు వెళ్లి సంచిని తెరచి చూశారు. గుండె ఆగినంత పనయ్యింది. సంచిలో దాదాపు 5 కిలోలకు పైగా ఆభరణాలున్నాయి. 30కి పైగా రకాల గాజులు, 25 రకాల కమ్మలు, 80 వరకు హారాలు, ఉంగరాలు ఉన్నాయి. అక్కడికక్కడ పని వదిలేసి ఇద్దరూ ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. సంచిలో ఉన్న ఆభరణాలను ఇద్దరూ సమంగా పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా పనులకు వస్తున్నారు.

ఇంట్లో దాచిన ఆభరణాలను రోజూ చూస్తూ మురిసిపోయారు. కానీ సోమవారం నలుగు రు పోలీసులు వెళ్లి ఆ కార్మికుల ఇళ్ల తలుపులు కొట్టారు. మీకు కాలువలో దొరికన ఆభరణాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మాకా..? ఆభరణాలు దొరికాయా..? అలాంటిదేమీలేదే.. అని సమాధానమిచ్చారు. ఇదిగో మీరు తీసుకెళుతున్న సంచి వీడియో చూడండి అని చెప్పగానే చేసేదేమీలేక ఒప్పుకున్నారు. ‘అయ్యా.. దొరికిన దాంట్లో కొంతైనా మాకు ఇస్తే ఉన్న కష్టాలు తీరిపోతాయి. కాస్త కనికరించడండి దొరా..!’ అని వేడుకున్నారు. ఒరేయ్‌ పిచ్చి మొద్దుల్లారా ఇది బంగారం కాదు.. గిల్టు నగలు, పదండి మాతో అని విచారణకు తీసుకెళ్లారు. సీన్‌ కట్‌చేస్తే చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన ఆభరణాల్లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అప్రైజర్‌ రమేష్‌ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి రుణం పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే వీటిని పడేసిన కాలువను చూపించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఉన్న గిల్టు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement