మృత్యు పంజా | Five Members Died in Road Accidents Visakhapatnam | Sakshi
Sakshi News home page

మృత్యు పంజా

Published Tue, Jul 23 2019 1:21 PM | Last Updated on Thu, Aug 1 2019 1:10 PM

Five Members Died in Road Accidents Visakhapatnam - Sakshi

గణేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మృత్యువు పంజా విసింది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురిని బలిగొంది. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువలకు మృతి చెందగా పిడుగు పాటుకు ఓ గిరిజన రైతు మరణించాడు. దీంతో వారికుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

రాంబిల్లి(యలమంచిలి): రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. బైక్‌ అదుపు తప్పి కొత్తూరు గ్రామం నేమ్‌ బోర్డు పోల్‌ను ఢీకొనడంతో కట్టుపాలెంకు చెందిన రావాడ గణేష్‌(38) అక్కడికక్కడే మృతిచెందగా, అదే గ్రామానికి చెందిన బొల్లం సునీల్‌(19) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్‌ఐ వి. అరుణ్‌కిరణ్‌ తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. అచ్యుతాపురం నుంచి యలమంచిలి–గాజువాక రోడ్డుపై కట్టుపాలెంకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో బైక్‌పై వెనుకన కూర్చొన్న గణేష్‌ వంతెన పైనుంచి కింద పడి మృతిచెందాడు. బైక్‌ నడుపుతున్న సునీల్‌కు తలకు తీవ్ర గాయమైంది. తొలుత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన  అనంతరం  విశాఖ పట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టుఎస్‌ఐ తెలిపారు. గణేష్‌కు భార్య సింహాచలం, కుమారులు సాయిగణేష్‌ , యశ్వంత్‌ ఉన్నారు. సునీల్‌కు వివాహం కాలేదు. సునీల్‌కు తండ్రి నాగేశ్వరరావు, తల్లి నాగమణి ఉన్నారు. మృతుల కుటుంబాలది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. గణేష్, సునీల్‌ మృతిచెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు ఇక  దిక్కెవరంటూ  వారు భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.  గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

పిడుగుపాటుకు గిరిజన రైతు మృతి
దేవరాపల్లి(దేవరాపల్లి):తామరబ్బ పంచాయతీ పల్లపుకోడాబు గ్రామంలో పిడుగుపాటుకు ఓ గిరిజన రైతు మృతి చెందాడు.   పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్లపుకోడాబు గ్రామానికి చెందిన సుకురు దేముడు(40) తన పశువుల పాకలలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు పెద్ద శబ్దంతో పిడుగు పడింది. అదే సమయంలో పాక లోపలి నుంచి బయటకు వచ్చిన సుకురు దేముడు పిడుగు ధాటికి కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తలి రించారు.  అప్పటికే అతను మరణించినట్టు పీహెచ్‌సీ సిబ్బంది ధ్రువీకరించారు. మృతుడు దేముడికి భార్య పార్వతితో పాటు కుమార్తెలు జ్యోతి, తేజస్విని, కుమారుడు భూపతిరాజు ఉన్నారు.  అప్పటి వరకు తమతో కలిసి ఉన్న  దేముడు కొద్ది క్షణాలలోనే విగతజీవిగా మారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోడంతో భార్య పార్వతితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి బంధువులు,కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకుని తామరబ్బ, చింతలపూడి పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు ఆస్పత్రికి తరలివచ్చారు.   దేవరాపల్లి ఎస్‌ఐ పి. నర్సింహమూర్తి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. పిడుగుపాటుకు దేముడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల యువజన అధ్యక్షుడు బూరె బాబురావు, మారేపల్లి మాజీ సర్పంచ్‌ అవుగడ్డ కోటిపల్లినాయుడు తదితర నాయుకులు పీహెచ్‌సీకి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ప్రాణాలు తీసిన  ఈత సరదా
గూడెంకొత్తవీధి(పాడేరు):ఈత సరదా  ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఉపాధి నిధులతో చెరువులో తవ్విన గోతిలో మునిగి మృత్యువాత పడి, కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. చెరువులో ఈతకు దిగి, నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో  జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ లింగవరం గ్రామానికి చెందిన సాగెని చిన్నారావు (ఉపాధ్యాయుడు), వెంకటలక్ష్మి దంపతుల కొడుకు జానకీ జతిన్‌(9), కంకిపాటి భూషణం(రైతు), అప్పలనర్సమ్మ కుమారుడు గిరివర్ధన్‌ (9)  సాయంత్రం వరకు తల్లిదండ్రులతో కలిసి పొలంలో పనిచేశారు. సాయంత్రం  5.30 గంటల సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా గ్రామ సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లారు.ఆ చెరువును ఆరు నెలల కిందట ఉపాధి హామీ పథకం నిధులతో లోతు చేశారు.  ప్రమాదవశాత్తు   ఆ గోతుల్లో పడి నీట మునిగి ఇద్దరూ చనిపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లల కోసం అన్వేషించారు.  అనుమానం వచ్చి  చెరువు వద్దకు వెళ్లి చూడగా జతిన్, గిరివర్ధన్‌ నీటిలో శవాలై తేలియాడుతూ కనిపించారు. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అంతముందు వరకు తమతో ఉన్న చిన్నారులు అంతలోనే విగతజీవులగా మారడంతో వారు గుండెలవిసేలా రోదించారు. జానకీజతిన్‌ చింతపల్లి సెయింటాన్స్‌ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు ఇతనికి కార్తీక్‌ అనే తమ్ముడున్నాడు.   గిరివర్ధన్‌ లింగవరం ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నాడు. ఇతనికి శివకుమార్‌ అనే అన్నయ్య ఉన్నాడు. వీరి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోమవారం చింతపల్లి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు జీకే వీధి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనీష్‌ తెలిపారు.  ఉపాధ్యాయ సంఘ నేతలు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, యూత్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ, జర్రెల సర్పంచ్‌ విజయకుమారి, కన్వీనర్‌ పిండి రామకృష్ణ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement