కోల్‌కతా: మాజీ మిస్ ఇండియా ఉషోషి సేన్‌గుప్తా (30)కు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది యువకులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డుకొని, దాడికి దిగారు. సోమవారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని నడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను మొత్తాన్ని వివరిస్తూ ఉషోసి సేన్‌గుప్తా ఫేస్‌బుక్‌లో వీడియోతో సహా పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.
ఉషోషి పోస్ట్‌లోని వివరాలు సంక్షిప్తంగా..
‘పనిముగించుకుని కలిగ్‌తో కలిసి తిరిగి ఇంటికి వెళుతుండగా కొంతమంది ఆకతాయిలు నేను ప్రయాణిస్తున్న ఉబర్ కారును అడ్డుకున్నారు. డ్రైవరు తారక్‌ను బలవంతంగా బయటికి లాగి, విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు. దీన్ని అడ్డుకున్నాను. నిమిషాల్లో మరో పదిహేనుమంది యువకులు వీరికి తోడయ్యారు. ఈ ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తూనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. దగ్గరలో ఉన్న మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారిని సాయం చేయమని కోరా. ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ స్పందించేందుకు సదరు పోలీసు ఆధికారి నిరాకరించాడు. అయితే డ్రైవర్‌ను వాళ్లు చంపేస్తారని గట్టిగా అరవడంతో చివరకు వచ్చి వాళ్లను చెదరగొట్టి వెళ్లిపోయాడు. అంతా అయ్యాక అప్పుడు భవానిపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు అధికారులు వచ్చారు. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు. ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను కోరాను. అప్పుడు కూడా ఆ దుండగులు వదలకుండా ఫాలో అయ్యారు. అంతేకాదు మూడు బైకుల మీద వచ్చిన ఆరుగురు మరోసారి కారును అడ్డుకున్నారు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటూ గలాటా చేశారు. కారుపై రాళ్లు విసిరి, కారు ఆపి బ్యాగ్ లాగేశారు. ఫోన్ లాక్కుని దాన్ని పగలగొట్టాలని చూశారు. చివరికి అమ్మానాన్న, సోదరి సహాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇలాంటి ఘటనలు రేపు మీకు ఎదురు కావచ్చు.. స్పందించి, నిందితులను గుర్తించాలి’
ఈ ఘటన తనను చాలా షాక్‌కు గురిచేసిందని, పోలీసులకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఉషోషి ఆరోపించారు. తన ఫిర్యాదు మాత్రమే తీసుకున్న అధికారులు ఉబెర్ డ్రైవర్ ఫిర్యాదును తీసుకోవడానికి అంగీకరించలేదని, అది చట్టానికి విరుద్ధమని, ఒకే కేసులో రెండు ఫిర్యాదులు తీసుకోలేమంటూ మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. హెల్మెట్ లేకుండా పది పదిహేను మంది యువకులు రోడ్లమీద హల్‌చల్ చేస్తోంటే పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తనకు జరిగిన అవమానాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. వేధింపులతో జీవించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయికి తన మద్దతు వుంటుందని తెలిపారు. అంతేకాదు ఫిర్యాదు చేసినప్పటికీ వేధిస్తున్న అబ్బాయిలపై చర్యలు తీసుకున్న దాఖలాలను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు.
మరోవైపు దీనిపై పోలీస్ విభాగం కూడా ట్విటర్‌లో స్పందించింది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నామని, కేసు నమోదు చేసి ఏడుగుర్ని అరెస్టు చేశామని కోలకతా పోలీస్ కమిషనర్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అరెస్టయిన యువకుల్లో రోహిత్, ఫర్దిన్ ఖాన్, సబీర్ అలీ, గని, ఇమ్రాన్ అలీ, వసీం, అతిఫ్ ఖాన్‌లుగా గుర్తించారు. కాగా లాస్‌వెగాస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2010లో సేన్‌గుప్తా ‘ఐ యామ్ షీ - మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు.
Seven people were arrested, yesterday, by Kolkata police on harassment and assault charges. The complaint was filed by model and actor Ushoshi Sengupta, the driver of her cab had also been assaulted by the accused. Further probe underway. #WestBengal pic.twitter.com/iMx9jl8Wq8
— ANI (@ANI) June 19, 2019
Comments
Please login to add a commentAdd a comment