
టేకులపల్లి (ఇల్లెందు): ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం పంతులునాయక్ తండాకు చెందిన మాలోతు మోతీలాల్, ఆయన భార్య లత, కుమారుడు చరణ్, మేనల్లుడు వంశీ (ఆటో డ్రైవర్).. ఆదివారం పాల్వంచ సమీపంలోని పెద్దమ్మ గుడికెళ్లారు. సాయంత్రం అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొత్తగూడెం క్రాస్‌రోడ్డు వద్ద మరో ముగ్గురు ప్యాసింజర్లు ఆటో ఎక్కారు.
అయితే టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ తంగెల్లతండా సమీపంలోకి రాగానే చరణ్, అతడి తల్లి లత కాలకృత్యాలు తీర్చుకోడానికి ఆటో దిగారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటో లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. జేసీబీల సాయంతో 3 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఒకరిని ఎర్రనాగు రమేశ్(25)గా గుర్తించారు. మరో ఇద్దరు మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొత్తగూడెం తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాలోతు మోతీలాల్ (40) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment