క్రాంతి మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి రమేష్, బంధువులు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు వెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వడంతో.. అక్కడ ఏర్పడ్డ తాటి చెట్టంత లోతైన గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంత య్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు స్నేహితులు కూడా నీటమునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నీలం రమేశ్, శేషకుమారిల కుమారులు క్రాంతి(15), శశివర్ధన్ (9), తాడికోరు సాంబశివరావు, లక్ష్మి దంపతుల కుమారుడు శివ (15), మల్లంపాటి కృష్ణ, నాగలక్ష్మి దంపతుల కుమారుడు దినేష్ (10), మరో ముగ్గురు చిన్నారులు ఆటోలో వరదను చూసేందుకు గుండిమెడ గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లారు. ఆటోను నది ఒడ్డున ఆపి, డ్రైవర్ సురేశ్ బహిర్భూమికి వెళ్లాడు. నీలం క్రాంతి, శశివర్ధన్, శివ, దినేశ్ నది వద్దకు చేరుకున్నారు.
టీడీపీ నేతలు గతంలో ఇసుకను తరలించేందుకు వేసిన రోడ్డులో వెళుతున్న క్రాంతి లోతైన ఇసుక గుంతల్లో పడిపోయాడు. క్రాంతిని కాపాడేందుకు శివవర్ధన్ ప్రయత్రించాడు. అయితే ఇద్దరూ నీటిలో జారిపోతూ భయంతో కేకలు వేశారు. స్నేహితులను కాపాడేందుకు దినేశ్, శివ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నీటిలోకి దిగడంతో వారు కూడా నీటమునిగి గల్లంతయ్యారు. దీనిని గమనించిన సురేశ్ హుటాహుటిన వచ్చి నలుగురిని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీనిపై సమాచారం అందుకున్న గుండిమెడ గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా గుంతలు 20 నుంచి 30 అడుగులు ఉండటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో నీలం క్రాంతి మృతదేహాన్ని వెలికితీశారు. 1.45 గంటలకు నీలం శశివర్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు.
అయితే ఎంత గాలించినా దినేశ్, శివ ఆచూకీ దొరకలేదు. చివరకు స్థానిక మత్స్యకారులు ముమ్మరంగా గాలించి నీటి అడుగున చిక్కుకున్న మల్లంపాటి దినేశ్ మృతదేహాన్ని, శివ మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వెలికితీశారు. మృతిచెందిన తమ కుమారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఘటనా స్థలానికి వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విద్యార్థుల మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఆ సమయంలో గల్లాజయదేవ్‌ను, స్థానిక టీడీపీ నేతలను గ్రామస్థులు నిలదీశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ చెప్పారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి..
మృతిచెందిన నలుగురు విద్యార్థుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. కుమారులు క్రాంతి, శశివర్ధన్ ఇద్దరు మృతిచెందడంతో తల్లిదండ్రులు నీలం రమేశ్, శేషకుమారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విగతజీవులుగా ఉన్న కుమారులను చూసి తల్లిదండ్రులు స్పృహ తప్పిపడిపోయారు.
అక్రమ ఇసుక తవ్వకాల నిగ్గు తేల్చాలి
– వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని ఇసుక రీచ్‌లో తాడిచెట్టు లోతు తవ్విన ఇసుక గుంతల్లో మృతి చెందిన నలుగురు చిన్నారులే ఇందుకు సాక్ష్యమన్నారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గతంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ తెలిపిందని గుర్తు చేశారు. నలుగురు చిన్నారుల ప్రాణాలు కోల్పోయారని, వారి తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వేమారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. చిన్నారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, మేకల సాంబశివరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment