
ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బాధిత కుటుంబం ,నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏఆర్ కానిస్టేబుల్ నగదు తీసుకుని మోసం చేశాడని చింతల రాగయ్య, పద్మ, పద్మాకర్ అనే వ్యక్తులు ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదు చేశారు. సోమవారం వారు నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. బాధితుల కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లికి చెందిన రాగయ్య, పద్మలు దంపతుల కొడుకు పద్మాకర్. అతను ఇంటర్ పూర్తిచేశాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు మానివేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు పనులకు వెళ్లసాగాడు. తమలాగే కుమారుడు కష్టపడకూడదని, ఏదైనా ఉద్యోగం వస్తే బతుకులు మారతాయని తల్లిదండ్రులు భావించారు.
ఈ క్రమంలో వారిని సమీప బంధువు కానిస్టేబుల్ శివాజీ కలిశాడు. పద్మాకర్‌కు పోలీసు శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం రూ.4 లక్షలకుపైగా అవుతుందని బంధువులు కాబట్టి రూ.3.50 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. తలకు మించిన భారమైనా కొడుకు భవిష్యత్ కోసం అప్పులు చేసి నాలుగు విడతలుగా రూ.3.50 లక్షలు చెల్లించినట్లుగా రాగయ్య చెబుతున్నాడు. కానిస్టేబుల్ అనుమానం రాకుండా ఉండేందుకు పద్మాకర్‌ను ఎస్పీ కార్యాలయంలోని ఎస్పీ, ఏఎస్సీ చాంబర్‌ల వద్దకు తీసుకెళ్లి అధికారులు మీటింగ్‌లో ఉన్నారని చెప్పేవాడు. నగదు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు కానిస్టేబుల్‌ను నిలదీశారు. దీంతో అతను ఏకంగా అప్పటి ఎస్పీ విశాల్‌గున్నీ, డీజీపీ సంతకాలతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను రాగయ్య ఇంటికి పంపాడు. అందులో నెల్లూరు పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు వచ్చినట్లు, జీతం రూ.15 నుంచి 20 వేల వరకు ఉంటుందని, 8 నెలల్లోగా ఉద్యోగంలో చేరాలని ఉంది. తాను చెప్పినప్పుడు లెటర్‌ను పోలీసు కార్యాలయంలో ఇచ్చి ఉద్యోగంలో చేరాలని కానిస్టేబుల్ చెప్పినట్లు రాగయ్య, పద్మాకర్ తెలిపారు. నెలల తరబడి వేచిచూసినా కానిస్టేబుల్ సరైన సమాధానం చెప్పకపోవడం, తిప్పించుకుంటూ ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సమర్పించాలని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణను ఆదేశించారు. తమను మోసం చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని రాగయ్య, పద్మ దంపతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment