
దేశయ్య, ప్రవీణ్‌కుమార్‌ల సెల్ఫీ (ఫైల్) ఘటనా స్థలంలో యువకుల మృతదేహాలు
చిన్ననాటి వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టి్టంది. ఎప్పుడు కలిసిమెలిసి ఉండే వారిపై పగబట్టింది. రోడ్డు ప్రమాదంలో వారిని కబళించింది. పండగ వేళ ఆ రెండు కుటుంబాల్లో పెనువిషాదం నింపింది. కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉండే కుమారులు అందనిలోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. బీచ్‌రోడ్డులోని రుషికొండ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విషాదకరమైన ఈ సంఘటన చోటుచేసుకుంది. జాలరి ఎండాడకు చెందిన దేశయ్య, అప్పుఘర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్, జాలరిపేటకు చెందిన సాయికుమార్ రుషికొండ ప్రాంతానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దేశయ్య, ప్రవీణ్‌కుమార్‌లు అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రుడికి కూడా అక్కడే వైద్యం అందిస్తున్నారు.
ఎంవీపీకాలనీ/పీఎంపాలెం: నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆ ఇద్దరు స్నేహితులు కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా కలిసే వెళ్తారు. ఏ పని చేసినా కలిసి మాట్లాడుకుని చేస్తారు. అందుకే విధికి కన్ను కుట్టిందేమో.. వారిని రోడ్డు ప్రమాద రూపంలో కబళించి వారి ఆశలను మొగ్గలోనే తుంచేసింది. బీచ్‌రోడ్డులో పెద రుషికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నతనం నుంచి స్నేహితులైన ఈ యువకులు చివరికి ఒక్కటి గానే తనువు చాలించి అటు కన్నవారిని, ఇటు ఆత్మీయులను శోకసంద్రంలో ముంచారు. పండగ పూట ఊహించని రితీగా వారి ఆయువు అనంతలోకాల్లో కలిసిపోవడం స్థానికులను కలచివేసింది. బీచ్‌రోడ్డులో పెద రుషికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొ ట్టు మిట్టాడుతున్నాడు. పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ సీఐ ఈ.వెంకునాయుడు తెలిపిన వివరాలివి.
అప్పుఘర్ ప్రాంతానికి చెందిన పండా ప్రవీణ్‌కుమార్ (20), జాలరి ఎండాడకు చెందిన చింతపల్లి దేశయ్య అలియాస్ రాజేష్(19), పెదజాలరి పేటకు చెందిన పి. సాయికుమార్‌లు బైక్‌పై ఆదివారం బీచ్‌రోడ్డు మీదుగా భీమిలి వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అతివేగంగా ప్ర యాణిస్తూ.. పెదరుషికొండ సాయి రిసార్ట్స్ ఎదురుగా ఉన్న స్పీడ్‌బ్రేకర్ వద్ద ముందుగా డివైడర్‌ను.. ఆ తర్వాత చెట్టును బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో దేశయ్య, ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సాయికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రుడికి కేజీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా.. దేశయ్య, ప్రవీణ్‌ల మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆదివారం కావడంతో సోమవారం వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుందని సీఐ తెలిపారు.
ప్రమాదానికి అతివేగమే కారణమా..
ద్విచక్రవాహనంపై అతివేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావి స్తున్నారు. ఒకే వాహనంపై దూసుకు వస్తూ స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేకపోయారు. ఆ సమయంలో బైక్‌ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో ముందు డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీ కొని దుర్మరణం పాలయ్యారు. ప్రవీణ్ కుమార్ అన్నయ్య సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇద్దరివీ నిరుపేద కుటుంబాలే..
అందివచ్చిన ఈ ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడాన్ని వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చింతపల్లి దేశయ్య తండ్రి ధనరాజు చేపలవేటనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. దేశయ్య చిన్నవాడు. జాలరి ఎండాడలోని పూరి గుడిసెలో వీరు నివాసముంటున్నారు. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన ప్రవీణకుమార్ కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కనీసం ఉండటానికి ఇల్లు లేని వీరు చిన్న ఇంటిలో అద్దెకు నివాసముంటున్నారు. ప్రవీణ్ తండ్రి మహవీర్ మార్బుల్స్ వర్క్ చేస్తుండగా అన్న సునీల్‌కుమార్ ఏపీ టూరిజం బార్‌లో పనిచేస్తున్నాడు. చెల్లి ఇంటి పనులు చేస్తోంది. ప్రవీణ్‌కుమార్, దేశయ్యలిద్దరూ ఇంటికి చిన్న కుమారులే.
చిన్నాడంటే ఎంతో గారాబం
మాది నిరుపేద కుటుంబం. దశాబ్దాలుగా పూడి గుడిసెలోనే నివాసం ఉంటున్నాం. ఇప్పుడిప్పుడే పిల్లలు అందివస్తున్నారు. కుటుంబం కూడా కుదుటపడుతోంది. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఇటీవల నాకు ప్రమాదం జరిగి చెయ్యి విరిగింది. కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొడుకు దూరమయ్యాడు. సమస్యలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నాడంటే వాళ్ల అమ్మకు ఎంతో గారాబం. తను తిన్నా తినకపోయినా.. పిల్లలకు ఏవి కావాలంటే అవి వండి పెడుతుంది. తనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు
– చింతపల్లి ధనరాజు, దేశయ్య తండ్రి
నాకు కావాల్సింది తెస్తానన్నాడు
2000లో నా కోడలు మృతి చెందింది. చిన్నతనం నుంచి అమ్మ లేకుండానే నా మనమడు పెరిగాడు. తల్లి లేని లోటు తెలియకుండా ప్రవీణ్‌కుమార్‌తో పాటు మిగతా ఇద్దరినీ పెంచాం. మాకు సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం అప్పుఘర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నాం. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఇంట్లోనే ఉన్న ప్రవీణ్ తన స్నేహితులు రావడంతో బయటకు వెళ్లివస్తానని చెప్పాడు. ఎక్కడికి అని అడగ్గా.. వచ్చేటప్పుడు నీకు కావాల్సింది తెస్తానంటూ వెళ్లిపోయాడు. నాకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో అదే తీసుకొస్తాడు అనుకున్నా.. అయితే అదే చివరి మాట, చివరి చూపు అవుతుందని అనుకోలేదు. ఇంత చిన్న వయసులో వాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మొత్తం కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచింది. –పండా దేవానంద్, ప్రవీణ్‌కుమార్ తాత
ప్రాణమిచ్చే స్నేహం వీరిది..
దేశయ్య, ప్రవీణ్ కుమార్‌లు చిన్నతనం నుంచి స్నేహితులు. 6వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి కూలి పనులు, చేపల వేట చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కొన్నేళ్ల కిందట ప్రవీణ్‌కుమార్ కుటుంబం జాలారి ఎండాడకు పక్కనే ఉన్న అప్పుఘర్‌కు నివాసం మార్చింది. ఆ తర్వాత పెయింటింగ్ పనులు నేర్చుకున్నారు. ఈ క్రమంలో వీరికి సాయికుమార్ పరిచయమయ్యాడు.కొన్నేళ్లుగా వీరు ముగ్గురూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీరికి కలిసి వెళ్లడం అలవాటని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పని లేని సమయంలో సరదాగా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. పండగ కావడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో ముగ్గురు కలిసి బయటకు వెళ్లి.. ఇలా ప్రమాదానికి గురయ్యారని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment