వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం.. యువతులపై లైంగికదాడులకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. ఎప్పుడూ ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు బయట చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ రౌడీగ్యాంగ్ అడ్డూఅదుపులేకుండా అకృత్యాలకు పాల్పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో వరుసగా జరుగుతున్న ఘటనలు వేలెత్తిచూపుతున్నాయి.
సాక్షి, జగిత్యాల : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట, లింగంలపేట, హస్నాబాద్ అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా హస్నాబాద్‌కు చెందిన ప్రేమజంటను బ్లాక్‌మెయిల్ చేసిన ఆ గ్యాంగ్ ఒకరి తరువాత మరొకరు నలుగురు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి ఆరోగ్యం క్షీణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో ఆ గ్యాంగ్ సభ్యులను గుర్తించిన బాధితురాలి బంధువులు వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అతను తాము చేసిన నేరాలనూ ఒప్పుకున్నాడు. కేవలం వీరే కాదూ.. ఇలాంటి కామాంధులు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.
లవర్స్ స్పాట్...!
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట లవర్స్‌స్పాట్‌గా పేరొందింది. గుట్ట ప్రాంతం కావడం, జన సంచారం లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చే ఆ ప్రాంతంలో ప్రేమజంటలు వాలుతుంటారు. అక్కడ ప్రేమాయణం ముగించుకుని తిరుగుముఖం పడుతున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ప్రతి రోజు ఎంతో మంది ప్రేమికులు లవర్స్‌స్పాట్‌కు పరుగులు పెడుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు.
అటువైపు పోలీసులూ దృష్టిసారించకపోవడంతో ఆ ప్రాంతం వ్యభిచారానికీ కేరాఫ్‌గా మారింది. అంతేకాదూ.. ధర్మపురికి వెళ్లే దారిలో ఉన్న ముప్పాలచెర్వు... గొల్లపల్లికి వెళ్లే దారిలో ఉన్న నల్లగుట్టతోపాటు జాబితాపూర్ అడవి ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు బయటికి పొక్కకపోవడంతో అది తెలియక యువతులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
రంగంలో పోలీసులు..!
హస్నాబాద్ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ అనంతశర్మ, జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్ ఈ నెల 3న హస్నాబాద్, లింగంపేట, అంబరిపేట ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులపై ఆరాతీశారు. మొబైల్ టీంను ఏర్పాటు చేసి.. అంబరిపేట, హస్నాబాద్, లింగంపేట మార్గం మధ్యలో నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. రెండ్రొజుల్లో ఔట్‌కట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేస్తామని ఎస్పీ అనంతశర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment