ప్రేమ జంట అగ్నికి ఆహుతి | lovers destroyed by fire | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట అగ్నికి ఆహుతి

Published Fri, Jan 9 2015 3:22 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రేమ జంట అగ్నికి ఆహుతి - Sakshi

ప్రేమ జంట అగ్నికి ఆహుతి

 సాక్షి, చెన్నై : ప్రేమోన్మాదం కోరలు చాచింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదన్న ఆవేదనతో ఓ జంట అగ్నికి ఆహుతి అయింది. మరో ఘటనలో, తన కుమార్తెను ప్రేమించి దూరంగా తీసుకెళ్లాడన్న ఆగ్రహంతో అల్లుడిని కిరాయి ముఠా ద్వారా ఓ అత్త కడతేర్చింది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో కళాశాల విద్యార్థినిని పాఠశాల విద్యార్థి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడు.  రాష్ట్రంలో ఇటీవల కాలంగా ప్రేమ పేరుతో అరాచకాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రేమించడం, పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకోవడం లేదా, పోలీసులను ఆశ్రయించడం ఓ వైపు జరుగుతోంది. మరో వైపు ప్రేమించ లేదన్న ఆగ్రహంతో యువతిపై దాడి చేయడం, కిడ్నాప్ చేసి లైంగిక దాడులు జరపడం, తనకు దక్కంది మరొకరికి దక్కకూడదన్న ఆక్రోశంతో ప్రేమోన్మాదిగా మారడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం తనను ప్రేమించ లేదన్న ఆగ్రహంతో తొమ్మిదో తరగతి విద్యార్థిని 22 ఏళ్ల యువకుడు హతమార్చిన ఘటన మరువక ముందే, రాష్ట్రంలో మళ్లీ ప్రేమోన్మాదం కోరలు చాచింది.
 
 ఆహుతి : వండలూరు సమీపంలోని ఉరపాక్కం ధనలక్ష్మి నగర్‌కు చెందిన తంగరాజ్, జయ దంపతులకు జయశ్రీ(21), రోజ(19), రాజ్(17) పిల్లలు. జయశ్రీ బీఎస్సీ పూర్తి చేసింది. తమ ఇంట్లో ఉన్న బంధువు నాగరాజు సోదరి అమల కుమారుడు స్వాతికుమార్‌తో జయశ్రీ ప్రేమలో పడింది. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించారు. స్వాతి కుమార్‌ను తమ ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. ఇటీవల ఈ ప్రేమ వ్యవహారం ఆ రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదాన్ని రేపింది. చివరకు దమయంతి అనే యువతితో స్వాతి కుమార్‌కు వివాహం చేశారు. జయశ్రీ, స్వాతి కుమార్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం తెలుసుకున్న దమయంతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరి వాడైన స్వాతి కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని జయశ్రీని వేడుకున్నా, ఫలితం శూన్యం.
 
 బుధవారం రాత్రి జయశ్రీని కలిసి తనను పెళ్లి చేసుకోవాలని విన్నవిం చాడు. మద్యం మత్తులో ఉన్న స్వాతి కుమార్‌ను జయశ్రీ మందలించింది. ఆవేదన చెం దిన స్వాతి కుమార్ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మంటల్లో కాలుతున్న కుమార్‌ను చూసిన జయశ్రీ తాను సైతం అంటూ అతడిని వాటేసుకుంది. జీవితంలో ఒకటి చేరని తాము, చావులోనైనా ఒకటి చేరాలన్న కాంక్షతో ఆ ఇద్దరు మంటల్లో ఆహుతి అరుుపోవడం చూసిన ఇరుగు పొరుగు వారు మంటల్ని ఆర్పి ఆస్పత్రికి తరలించారు. క్రోంపేట ఆస్పత్రిలో గురువారం ఉదయం ఈ ఇద్దరు ఒకరి తర్వాత మరొకరు చికిత్స ఫలించక మరణించారు. సమాచారం అందుకున్న పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దమయంతితో విడాకుల అనంతరం ఇద్దరికి వివాహం చేయించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నానని, ఈ సమయంలో ఆ ఇద్దరు ఆహుతి కావడం వేదన కలిగిస్తోందని బంధువు నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అల్లుడిని... : తంజావూరు తిరుకాట్టు పల్లికి చెందిన ఆనందరాజ్(27) అదే ప్రాంతంలోని చంద్రకుమార్, మోహనాంబాల్ దంపతుల కుమార్తె షర్మిల(19)ను ప్రేమించి 8 నెలల క్రితం తన వెంట తీసుకెళ్లాడు. వీరి కోసం గాలించి రెండు వారాల క్రితం కేరళలో ఉన్నట్టు గుర్తించారు. తన కుమార్తె షర్మిల గర్భవతి కావడంతో ఈ ప్రేమ వివాహానికి మోహనాంబాల్ అంగీకారం తెలిపింది. దీంతో ఆనంద రాజ్, షర్మిల తమ స్వగ్రామానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం తమ పాత ఇంటిని శుభ్రం చేయడానికి అల్లుడు ఆనందరాజ్‌ను వెంట బెట్టుకుని వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే బస చేయాలని అల్లుడికి సూచించింది. దీంతో ఇంటి బయట ఆనంద రాజ్ నిద్రకు ఉపక్రమించాడు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఆనందరాజ్‌పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కే విధంగా కిరాయి ముఠా ద్వారా అతి కిరాతకంగా కడతేర్చింది. గురువారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న ఆనందరాజ్‌ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
 కత్తి పోటు: కోయంబత్తూరు సెల్వపురానికి చెందిన రాజ్‌కుమార్ కుమార్తె లత(18) అక్కడి ఓ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే ప్రాంతానికి చెందిన జయకుమార్ కుమారుడు కపిల్(16) లతను ప్రేమించడం మొదలెట్టాడు. తనను ప్రేమించాలంటూ అతను వేధించడం మొదలెట్టాడు. ఇద్దరికి వయసులో తేడా ఉందని, ప్రేమను పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టాలని లత హితబోధ చేసింది. ఇందుకు అంగీకరించని కపిల్ గురువారం తన వెంట తెచ్చుకున్న కత్తితో లతను పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement