బూచోళ్లను పట్టుకున్నారు! | gang of kidnappers arrested | Sakshi
Sakshi News home page

బూచోళ్లను పట్టుకున్నారు!

Published Sat, Sep 30 2017 3:49 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

 gang of kidnappers arrested - Sakshi

చిన్న పిల్లలు కనిపించే దేవుళ్లంటాం.. ఏడిస్తే ఓదారుస్తాం.. అల్లరి చేసినా అక్కున చేర్చుకుంటాం.. మారాం చేసినా గారాబంగా చూసుకుంటాం..గోరుముద్దలు తినిపిస్తూ ఆడిస్తాం..లాలిస్తాం.. రాత్రి పూట నిద్రలేచి ఏడుస్తుంటే ‘రేయ్‌.. ఏడ్చొద్దు.. ఏడిస్తే బూచోడు పట్టుకుపోతాడు’ అని మాయమాటలు చెప్పి నిద్రపుచ్చుతాం.. అవే మాటలే ఆ తల్లిదండ్రులకు నిజమయ్యాయి..అభం శుభం తెలియని పసిపిల్లలు ఆడుతూపాడుతూ కళ్లెదుట తిరగాల్సిన సమయంలో అదృశ్యమయ్యారు.. నెలలు గడుస్తున్నా చిన్నారుల ఆచూకీ లేదు..వారినే తలుచుకుంటూ ‘అదిగో వస్తున్నారు..ఇదిగో పిల్లలొస్తున్నారు’ అని నిద్రాహారం మానేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఓపికున్నంత వరకు గాలించారు. తెలిసినవారందరినీ విచారించారు. పూజలూ పునస్కారాలు చేశారు. పోలీసులకు మొర పెట్టుకున్నారు. వారి నిరీక్షణ పోలీసుల రూపంలో ఫలించింది. పిల్లలను ఎత్తుకెళ్లిన బూచాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి ముగ్గురు పిల్లలనూ స్వాధీనం చేసుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు.

అనంతపురం సెంట్రల్‌:
కదిరి ప్రాంతంలో చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్న ముఠాను ఎస్పీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్‌ చేసింది. 12 మంది సభ్యులు గల ముఠాలో కీలక నిందితుడైన పసుపులేటి సుబ్బరాయుడుతోపాటు రామాంజనేయులు (నల్లచెరువు మండల కేంద్రం), రాజు (కర్నూలు జిల్లాడోన్‌), రాజేష్‌ (నిజామాబాద్‌ జిల్లా కేంద్రం రోటరీనగర్‌), సొత్తుపాటి హరికృష్ణ (హైదరాబాద్‌లోని శేర్లింగంపల్లి)ను అరెస్ట్‌ చేసి, ఒక కారును స్వాధీనం చేసుకుంది. వీరి చెరలో ఉన్న వికాస్, జైనుల్లా, శివసాయి అనే ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించింది. ముఠాలోని మిగతా ఏడుగురు సభ్యులైన బాబు (నిజామాబాద్‌), రవి, కిరణ్, సాయి (డోన్‌), నాగమ్మ, నిర్మల, సాయిరాం (నల్లచెరువు)ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం అనంతపురంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మీడియాకు వెల్లడించారు.

కిడ్నాప్‌ చేశారిలా..
ఈ ఏడాది మార్చి 12న కదిరి పట్టణం రాజేంద్రప్రసాద్‌ వీధికి చెందిన ఆంజనేయులు కుమారుడు వికాస్‌(6)ను ప్రభుత్వాస్పత్రి వద్ద చాక్లెట్‌ చూపించి ముఠా సభ్యులు కిడ్నాప్‌ చేశారు. ఈ చిన్నారిని ఎత్తుకెళ్లిన ముఠా సభ్యుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన బాబు నానిగా పేరు మార్చి.. రూ.2లక్షలకు అమ్మేశాడు. ఏప్రిల్‌ 3న నల్లచెరువులో అల్లాబకాష్‌ కొడుకు జైనుల్లా(6) పాఠశాల వద్ద ఉండగా అదే తరహాలోనే కిడ్నాప్‌ చేశారు. చందుగా పేరు మార్చి అమ్మేశారు. జూలై 6న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగరాజు కుమారుడు శివసాయి(6) ఇంటివద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్‌ చేసి.. అజయ్‌గా పేరు మార్చి.. అమ్మేశారు. ముఠాలోని కొందరు ఈ పిల్లలకు పిక్‌ ప్యాకెట్లు ఎలా కొట్టాలో శిక్షణ ఇచ్చేందుకు కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని పూణే ప్రాంతాలకు తీసుకెళ్లారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు
శివసాయి అదృశ్యానికి ముందు రోజు ఎస్పీగా అశోక్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. మిస్సింగ్‌ కేసును ఛేదించడంపై ఎస్పీ దృష్టిపెట్టారు. ఎంత లోతుగా విశ్లేషిస్తున్నా ఆచూకీ లభించలేదు. కదిరి పరిసర ప్రాంతాల్లో ఈ తరహా మిస్సింగ్‌ అంతకు ముందు జరిగినట్లు అక్కడి పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీని వెనుక ముఠా ఉన్నట్లు భావించిన ఎస్పీ.. ఈకేసును సవాల్‌గా తీసుకొని ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపారు. కదిరి ఇన్‌చార్జ్‌ డీఎస్పీ వెంకటరమణ, సీఐ శ్రీధర్, ఎస్‌ఐలు ప్రసాద్, హేమంద్‌కుమార్, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పిల్లల ఆచూకీ కోసం మన రాష్ట్రంతో పాటు కేరళలో కూడా పర్యటించి వచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 9న తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన అరుణ్‌ అనే చిన్నారి కిడ్నాప్‌ చేధింపు ఘటనలో పసుపులేటి సుబ్బరాయుడు, మరికొందరిని అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక బృందం పోలీసులు సుబ్బరాయుడును కస్టడీలోకి తీసుకొని విచారించారు. కదిరి ప్రాంతంలో చిన్నపిల్లల కిడ్నాప్‌కు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు.  దొరకరనుకున్న పిల్లలు తిరిగి వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఆ కుటుంబాల్లో పండుగ సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement