థానె: ఒక రోజు వయసున్న బాలుడిని దొంగతనం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను థానే పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆ బాలుడితోపాటు మరో ఐదుగురు పిల్లలను రక్షించారు. ఇన్‌స్పెక్టర్ నితిన్ థాక్రే ఆధ్వర్యంలోని పోలీసుల బృందం కళ్యాణ్ తహసిల్‌లోని పీసావలి గ్రామంలోని ఓ ఇంటిపై దాడిచేసి గుడియా సోను రాజభర్(35), ఆమె భర్త సోను రాజ్‌భర్(40), విజయ్ కైలాస్ శ్రీవాత్సవ (55)లను అరెస్టు చేసింది. ఆ ఇంటి నుంచి థానే సివిల్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దొంగిలించిన శిశువుతోపాటు మరో ఐదుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు. వీరిలో 2 నెలల ఆడశిశువు, పదకొండు, తొమ్మిది, ఐదు సంవత్సరాల వయసున్న బాలికలు, మరో మూడేళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. పసికందును అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఓ మహిళ ఈ పసికందు తల్లి వద్దకు వచ్చి మీ తల్లి బాలుడిని చూడాలనుకుంటోందని చెప్పి తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు థానే పోలీసులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలో సోదా చేశారని, అలాగే ఆస్పత్రి, రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి పీసావలి గ్రామానికి పోలీసులు వెళ్లి ఆ ఇంట్లో సోదా చేశారని కమిషనర్ మధుకర్ పాండే వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీరు పిల్లలను దొంగిలించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment