రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత | Ganja Gang Arrested In Paderu | Sakshi
Sakshi News home page

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Published Sat, Aug 3 2019 8:22 AM | Last Updated on Tue, Aug 20 2019 12:42 PM

Ganja Gang Arrested In Paderu - Sakshi

పాడేరు రూరల్‌: పట్టుబడిన గంజాయి మూటలు 

సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది శుక్రవారం విశాఖ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించి వాహనాల్లో తరలించుకుపోతున్న రూ. 1.30 కోట్ల విలువైన 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు నలుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది పరారైనట్టు అధికారులు తెలిపారు. గూడెంకొత్త వీధి మండలం సీలేరు పోలీసు స్టేషను పరిధిలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఐచర్‌వ్యాన్‌లో కొబ్బరిబొండాల కిందన బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు

దీంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా బస్తాల్లో ఉంచిన 570 కిలోల గంజాయి లభ్యమైంది. మావోయిస్టు అమరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండగా గంజాయి పట్టుబడింది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా నిందితులు వ్యాన్‌ను విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు చెప్పారు. వీరి కోసం గాలిస్తున్నామని.. గంజాయిని చింతపల్లి ప్రాంతం నుంచి తెలంగాణా రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసిందన్నారు. 

గుట్టు రట్టు!
విశాఖ ఏజెన్సీ పెదబయలు ప్రాంతం నుంచి ముంబాయికి గంజాయి తరలిస్తున్న ఓ అంతర్‌రాష్ట్ర ముఠాను ఎక్సైజ్‌ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలియజేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠాలు విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మారుమూల ప్రాంతాల నుంచి ఖరీదైన శీలవతి రకం గంజాయిను కొనుగోలు చేసి ముంబాయి, విశాఖపట్నం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నట్లు పాడేరు ఎక్సైజ్‌ సీఐ డి.అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో అనిల్‌కుమార్‌ తన సిబ్బందిని వెంటపెట్టుకొని గురువారం రాత్రి పెదబయలు మండలం చుట్టుమెట్ట, పాడేరు మండలం గుత్తులపుట్టు సంత బయలు జంక్షన్‌లో కాపు కాశారు.

పెదబయలు ప్రాంత నుంచి వేర్వేరు నంబర్లు ఉన్న (ముందున ఎంహెచ్‌ 17ఎజెడ్‌317, వెనుక వైపు ఏపీ 31సిక్యూ2772) కలిగిన కారును చుట్టుమెట్ట వద్ద, ఏపీ 31 బీయూ 2375 నంబర్‌ గల కారును సంతబయలు వద్ద పోలీసులు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. వీటిలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించి పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ధన్‌రాజ్‌ జాదవ్, సచిన్‌ శావంకి, ఒడిశా రాష్ట్రం పాడువాకు చెందిన పేరొందిన స్మగ్లర్‌ సంజాయ్‌ లక్ష్మణ్‌రాయ్‌ అలియాస్‌ సంజాయ్‌ జవహార్‌లాల్, ఆనంద్‌ పెలమాల్‌లను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుండి 105 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకొని కార్లకు సీజ్‌ చేశారు. పట్టుకున్న గంజాయి, కార్ల విలువ రూ. 30 లక్షలు ఉంటుంది. అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు.

గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు
కశింకోట: గంజాయిని ఆటోలో తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఎస్‌.వి.ఎస్‌.రామకృష్ణ తెలిపారు. ఇతని నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన కంట్రెడ్డి శివ అదే గ్రామం నుంచి ఆటోలో గంజాయిని తీసుకొని వెళ్తుండగా కశింకోట నూకాంబిక ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. మరో   నలుగురు పరారైనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement