ఘజియాబాద్: రెండేళ్ల క్రితం ఓ బాలుడు కిడ్నాప్‌కి గురయ్యాడు. డబ్బు డిమాండ్ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారిని విచారణ చేపట్టినా లాభం లేకపోయింది. ఆ బాలుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కానీ, 18 నెలల తర్వాత ఆ బాలుడి పక్కంటి మేడపై ఎముకల గూడుగా దర్శనమిచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో జరిగిన ఘటన దేశ రాజధాని శివారులో కలకలం రేపింది.
అసలేం జరిగింది... సహిబాబాద్‌లోని శంషద్ గార్డెన్ ప్రాంతంలో బార్బర్ పని చేసుకునే నజర్(38) కుటుంబం నివసిస్తోంది. ఈ నెల 1వ తేదీన అతని పెద్ద కొడుకు జునైద్(9) బంతి కోసం పక్కింటి డాబాపైకి వెళ్లాడు. అక్కడ ఓ చెక్కపెట్టె కనిపించటంతో మూతను తెరిచి చూశాడు. రెండడుగుల పెద్ద బొమ్మలాంటిది ఒకటి బయటపడింది. అది భయంకరంగా ఉండటంతో పరిగెత్తి తండ్రికి విషయం తెలియజేశాడు. అయితే వారు అతని మాటలను తేలికగా తీసుకోవటంతో సెల్ ఫోన్‌లో ఫోటోలు తీశాడు. రెండు రోజుల తర్వాత ఆ ఫోటోలను చూసిన కుటుంబ సభ్యులు అదొక అస్థిపంజరంగా గుర్తించి ఆ పెట్టెను తెరిచి చూశారు. అయితే అదే పెట్టెలో స్కూల్ యూనిఫామ్ బయటపడటంతో అది రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తమ కొడుకుదేనని నజర్ గుర్తించారు.
...2016 డిసెంబరు 1వ తేదీన మహమ్మద్ జైద్(4) అనే బాలుడు కనిపించకుండా పోయాడు. పిల్లాడి కోసం చుట్టుపక్కల వెతికిన నజర్, కుటుంబ సభ్యులు చివరకు మసీదుల్లోని మైకుల ద్వారా చాటింపు వేయించారు. దీంతో కొందరు యువకులు అక్కడున్న అన్ని ఇళ్లలో జల్లెడ పట్టారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. వారం తర్వాత కొందరు దుండగులు జైద్ తండ్రికి ఫోన్ చేసి తామే కిడ్నాప్ చేశామంటూ రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు ప్రణాళిక రచించి నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు ఇర్ఫాన్ అని, వీరిద్దరూ జైద్ ఉంటున్న ప్రాంతంలోనే ఉంటారని దర్యాప్తులో వెల్లడైంది.
వార్త తెలియగానే కుప్పకూలిన జైద్ తల్లి
అసలు ట్విస్ట్.. అయితే బాలుడి అదృశ్యం, కిడ్నాపర్ల కాల్స్ విషయం తెలుసుకున్న నిందితులు.. కేవలం డబ్బు కోసమే బాలుడి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించటంతో నిర్ఘాంతపోవటం పోలీసుల వంతు అయ్యింది. అసలు కిడ్నాపర్లు ఎవరన్న దానిపై చిన్న క్లూ కూడా లభ్యం కాకపోవటంతో చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ పోలీసులను ఈ కేసులో సాయం చేయాల్సిందిగా ఘజియాబాద్ పోలీసులు కోరారు. తమ కొడుకు తిరిగి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు చివరకు గుండెకోతే మిగిలింది. దాదాపు 18 నెలల తర్వాత బాలుడి అస్థిపంజరం ఇలా బయటపడింది.
ఘటనా స్థలంలో పోలీసులు
పోలీసుల అనుమానాలు... సమాచారం అందుకున్న పోలీసులు అస్థి పంజరాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. అయితే ఏ ప్రయోజనం లేకపోవటంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. బెయిల్‌పై బయట ఉన్న నిందితులను మరోసారి ప్రశ్నించిన పోలీసులు వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటంతో వేరే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ గదిలో పాత సామాన్లు దాస్తామని, రెండేళ్ల క్రితం తన కూతురి వివాహ సమయంలో ఆ పెట్టెను పైన పడేసినట్లు పక్కింటి యాజమాని మోమీన్ చెబుతున్నారు. ఒకవేళ కిడ్నాపర్లు బాలుడిని అక్కడే బంధించి ఉంటే కనీసం కుళ్లిన వాసన అయినా వచ్చి ఉండాలన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? లేక బాలుడ్ని ఇక్కడే బంధించారా? డబ్బు కోసం కుటుంబ సభ్యులెవరైనా ఈ పని చేసి ఉంటారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే ఈ కేసులో కొంత పురోగతి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment