![Girl Commits Suicide After Parents Humiliated By Family Of Boy Harassing Her - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/12/hanging-shadwo.jpg.webp?itok=W8PHh7rm)
జబల్‌పూర్ : కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారన్న బాధతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్‌పూర్‌లో ఏడోతరగతి చదువుతున్న బాలికను గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం ఆ యువకుడు బాలిక చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టి.. తనకు కాల్ చేయాలని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు అతడి ఇంటికి వెళ్లారు. తమ కూతురిని వేధిస్తున్న సంగతి వారు యువకుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని నమ్మకపోగా బాలిక కళ్లముందే ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని బాలిక ఆవేదనకు గురై ఇంటికి వెళ్లిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో వారు గుండెలు బాదుకున్నారు. యువకుడిపై, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ అల్పానారాయణ్ మిశ్రా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడైన యువకుడి వయస్సు 17 ఏళ్లు అని, అతడు మైనర్ తల్లిదండ్రులు చెప్తుండగా... ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment