డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ విద్యావేత్త, గీతం వర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. అమెరికాలోని అలస్కాలోని ఆంకరేజ్ సిటీ వద్ద మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య , వీరమాచినేని శివ ప్రసాద్, వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆంకరేజ్ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, సహాయక సిబ్బంది
అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు.
అమరావతి: డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానని తెలిపారు. మూర్తి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస్‌రావులు ఎంవీవీఎస్ మూర్తి హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమెరికా పర్యటనలో స్నేహితులతో ఎంవీవీఎస్ మూర్తి
సంతాపం
ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment