రాజేంద్రనగర్ : ఒకటి కాదు... రెండు కాదు... 11 నెలలుగా 30 మేకలను ఎత్తుకెళ్లారు. కారుల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనాల విషయం తెలిసి దొంగలను పట్టుకునేందుకు స్థానిక యువకలు ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు సరికదా.. ఆ కారును వారి మీదకే దూకించి భయపెట్టేవారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్న చందంగా ఎట్టకేలకు మేకల దొంగలు పోలీసులకు చిక్కారు. కారు పంక్చర్ కావడంతో స్థానిక యువకులు గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమావతిపేట ప్రాంతంలో స్థానిక కురుమ, యాదవులు మేకలను పెంచుతున్నారు.
వీటిని తమ ఇళ్ల ముందు ఉన్న పాకలతో పాటు బస్తీలోని ఖాళీ స్థలంలో రాత్రి సమయాలలో గడ్డి వేసి ఉంచేవారు. గత 11 నెలలుగా రాత్రి సమయంలో వాహనాలలో వచ్చిన దొంగలు వీటిని ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఇలా 30 మేకలను అపహరించారు. ఈ విషయమై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. స్థానిక యువకులు రాత్రి సమయంలో బస్తీలలో కాపు కాసినా వారిపైకే వాహనాలను తీసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేసి తప్పించుకునే వారు. వాహనాలకు నెంబర్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వారిని పట్టుకోవడంలో స్థానిక యువకులు విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక యువకులు ప్రేమావతిపేట శివాలయం వద్ద కాపు కాశారు.
కారులో నలుగురు యువకులు ప్రేమావతిపేట ప్రాంతానికి వచ్చారు. ఓ వీధిలో నిద్రిస్తున్న మూడు మేకలను రెప్పపాటులో కారులోకి వేసుకున్నారు. మేకల శబ్ధానికి అప్రమత్తమైన యువకులు కారు వద్దకు రాగానే రివర్స్‌లో వారిపైకే వేగంగా పోనిచ్చారు. అప్రమత్తమైన యువకులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో వాహనం ముందు టైర్ పంక్చరైంది. అలాగే ముందుకు వేగంగా పోనిచ్చారు. రోడ్డుపై కొద్దిదూరం వెంబడించినా యువకులకు కారు చిక్కలేదు. విషయాన్ని పెద్దలకు చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాహనం పంక్చర్ కావడంతో దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో డాంబర్ రోడ్డు (బీటీ రోడ్డు)ను రాసుకుంటూ వెళ్లింది.
యూనివర్సిటీ రోడ్డు నుంచి బుద్వేల్ మీదుగా స్థానిక చర్చి ప్రాంతంలో పార్కు చేసి ఉంది. దీంతో యువకులు వాహనాన్ని గుర్తించి దానిపై స్థానికులను ఆరా తీశారు. స్థానిక యువకులే దొంగతనాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనంతో పాటు నలుగురు యువకులు, ఒక మేకను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత 11 నెలల కాలంగా 30 మేకలను దొంగలించింది వీరేనా, వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ యువకులంతా 24 సంవత్సరాలలోపే ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment