మోమిన్‌పేట: బంగారం తాకట్టు దుకాణంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపు వెంటిలేటర్ ఊచలు తొలగించి 68 తులాల పసిడి, రూ. 96 వేల నగదు అపహరించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మోమిన్‌పేట నూతన బస్టాండ్ సమీపంలోని శ్రీశాంకరీ ఎంటర్ ప్రైజెస్‌లో నిర్వాహకులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని నగదు అప్పుగా ఇస్తుంటారు.
గురువారం రాత్రి గుర్తు తెలియని దండగులు దుకాణం వెనుక భాగంలో వెంటిలేటర్‌కు ఉన్న ఊచలను తొలగించి లోపలికి ప్రవేశించారు. షాప్‌లోని ఇనుప పెట్టెను తెరిచి అందులోని 68 తులాల బంగారం, రూ. 96 వేల నగదును అపహరించారు. శుక్రవారం ఉదయం నిర్వాహకులు దుకాణం తాళం తెరిచి చూడగా ఇనుప పెట్టె తెరిచి ఉంది. డీఎస్పీ శిరీష, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌తో పాటు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందం ఘటనా స్థలాన్ని సందర్శించారు.
పని చేయని సీసీ కెమెరాలు: సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన 9 మంది డైరెక్టర్లుగా శ్రీశాం కరీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో గతేడాది బంగారం తాకట్టుపై అప్పులు ఇచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. అందులోని ఒక డైరెక్టర్ మల్లేశ్ వ్యాపార లావాదేవీలు చూస్తుంటారు. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన రియాద్‌ను సహాయకుడిగా పెట్టుకున్నారు.
డబ్బులు దాచిపెట్టే ఇనుప పెట్టె తాళం చెవులు దుకాణంలోనే వీరిద్దరికీ తెలిసిన చోటే పెడుతుంటారు. గురువారం ఉదయం నుంచి సీసీ కెమెరాలు మరమ్మతుకు గురవడంతో పనిచేయడం లేదని మల్లేశ్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment