
బాధితురాలు ఉమారాణి
బచ్చన్నపేట: మండలంలోని అలింపూర్ గ్రామ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు వద్ద 9 తులాల బంగారం చోరీ అయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం... సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఎనిశెట్టి ఉమారాణి ఉదయం జనగామలో జరిగే ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తన వద్ద ఉన్న లాంగ్ చైన్, నక్లెస్, చిన్న చైన్‌లను ఓ కవర్‌లో పెట్టి తన వద్ద ఉన్న బ్యాగులో పెట్టానన్నారు.
జనగామలో ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు ప్రయాణంలో ముస్త్యాలకు వస్తుండగా ఇద్దరు మహిళలు మూతులకు గుడ్డలు కట్టుకొని బస్సు ఎక్కి తన పక్కనే కూర్చొని చేర్యాలకు టికెట్ తీసుకున్నారని చెప్పారు. కానీ వారు అలింపూర్ గ్రామం రాగానే దిగి పోయారని, వారు మధ్యలో ఎందుకు దిగారు ఎవరివైనా వస్తువులు పోయాయా.. చూసుకోండి అని కండక్టర్ అనడంతో బ్యాగులో చూసే సరికే బంగారం కవరు అగుపించలేదని, బస్సును ఆపి దిగి చూస్తే ఎవ్వరూ లేరని లబోదిబోమన్నారు. సినీ ఫక్కీలో చోరీ జరిగిందని, ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.